సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను జిల్లా అధికారులు విడుదల చేశారు. డీపీసీ ఎన్నిక నిర్వహణకు గాను ఈనెల 8వ తేదీన నోటిఫికేషన్ ప్రచురించాలని, 17న ఎన్నిక జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 8వ తేదీన డీపీసీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని జడ్పీ సీఈఓ కె.దామోదర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి...
జిల్లా ప్రణాళిక కమిటీకి జడ్పీ చైర్మన్ చైర్‌పర్సన్‌గా, కలెక్టర్ సభ్యకార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీలో మరో 28 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో నలుగురు నామినేటెడ్ పద్ధతిలో, 24 మంది ఎన్నిక ద్వారా సభ్యులవుతారు. వీరిలో 20 మంది జడ్పీటీసీలు, నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లుంటారు. నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికయ్యే నలుగురిలో ఒకరు మైనార్టీ సభ్యులుంటారు.
ఎన్నిక పద్ధతిలో సభ్యులయ్యే 24 మందిని ఎన్నుకునేందుకు గాను జిల్లాలోని 59 మండలాల జెడ్పీటీసీలు, 7 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 210 మంది కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు.
ఈ ఎన్నికకు రిజర్వేషన్ పద్ధతి కూడా వర్తిస్తుంది. మొత్తం 20 మంది జడ్పీటీసీల్లో ఎస్టీలకు3, ఎస్సీలకు 4, బీసీలకు 7, జనరల్‌కు 6 కేటాయించారు.
నలుగురు కౌన్సిలర్లకు గాను ఎస్సీ మహిళ - 1, బీసీ జనరల్ - 1, అన్‌రిజర్వ్‌డ్ మహిళ, జనరల్‌కు ఒక్కొక్కటి కేటాయించారు.
వీరిని ఈనెల 17న కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ఎన్నిక బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. (ఎన్నిక అనివార్యమైనపక్షంలో)
ఒక్కో జెడ్పీటీసీ సభ్యుడు 20 మంది జెడ్పీటీసీ సభ్యులకు ఓటేసి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక్కో మున్సిపల్ కౌన్సిలర్ నలుగురు కౌన్సిలర్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఈ ఎన్నికలో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు. వీరు డీపీసీలో శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. జెడ్పీచైర్మన్, మున్సిపల్ చైర్మన్లకు ఓటు హక్కు ఉంటుంది.
నామినేషన్ సమయంలో జెడ్పీటీసీ అభ్యర్థిని మరో జెడ్పీటీ సీ, కౌన్సిలర్ సభ్యుడిని మరో కౌన్సిలర్ బలపరచాల్సి ఉంటుంది.
ఈనెల 8న మున్సిపాలిటీల్లో మున్సిపల్ కౌన్సిలర్ల ముసాయిదా ఓటరు జాబితా, జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్ల ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు.
ఉదయం ఓటింగ్ అనంతరం అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు.
డీపీసీ షెడ్యూల్ విడుదల
Published Sun, Dec 7 2014 3:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement