మే రెండో వారంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్!
నియోజకవర్గాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం
కాంగ్రెస్ నుంచి రాజగోపాల్, టీఆర్‌ఎస్ నుంచి ‘తేరా’లకే అవకాశం!
నేతి విద్యాసాగర్‌ను గవర్నర్ కోటాలో పంపే యోచనలో కేసీఆర్
నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం హామీతో అధికార పార్టీ నేతల్లో ఆశలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయంలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాల పునర్విభజనకు రాష్ట్రపతి గురువారం ఆమోదముద్ర వేయడంతో త్వరలోనే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ రానుందని రాజకీయ వర్గాలంటున్నాయి. పునర్విభజన ద్వారా జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం పెరిగే అవకాశం లేకపోయినా, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం ముగియనుండడంతో ఖాళీ కానున్న స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మే రెండో వారంలో వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీపడుతాయని భావిస్తున్న రెండు ప్రధాన పార్టీల నుంచి ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పక్షాన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పక్షాన తేరా చిన్నపురెడ్డిలకే టికెట్ వస్తుందని ఇరుపార్టీల నేతలంటున్నారు.
వారిద్దరే..
వాస్తవానికి జిల్లాలోని స్థానిక సంస్థల బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నుంచే అభ్యర్థులు ఈ ఎన్నికలలో బరిలో నిలవనున్నారు. అయితే, కాంగ్రెస్‌కు అన్ని పార్టీల కంటే ఎక్కువ మంది స్థానిక ప్రజాప్రతినిధులున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎక్కువ మంది ఆ పార్టీ నుంచే గెలుపొందారు. కానీ, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోనికి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో బలాబలాల్లో మార్పులొచ్చాయి. బలాబలాల్లో మార్పుల లెక్క అటుంచితే ఆ రెండు పార్టీలు మినహా మిగిలిన పార్టీలకు పోటీచేసి గెలుపొందేంత మంది బలం లేదు. దీంతో ఆ రెండు పార్టీలే బరిలో నిలవనున్నాయి. ఇక, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ టికెట్‌ను చాలా మంది ఆశిస్తున్నా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే వస్తుందని తెలుస్తోంది. ఆయనకు టికెట్ ఇప్పటికే ఖరారయిందని, చివరి నిమిషంలో మార్పు జరిగితే ఆయనే బరిలో ఉంటారని పార్టీ నేతలంటున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా రాజగోపాల్‌రెడ్డి కూడా అనేక సమావేశాల్లో ఇప్పటికే ప్రకటించారు.
అయితే, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, కోమటిరెడ్డి సోదరులకు ఉన్న అభిప్రాయభేదాల నేపథ్యంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కూడా లేకపోలేదు. టీఆర్‌ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ నుంచి తేరా చిన్నపరెడ్డి బరిలో నిలవనున్నారు. చివరి నిమిషంలో మార్పు జరిగితే మినహా ఆయన అభ్యర్థిత్వం కూడా దాదాపు ఖరారయినట్టే. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చేటప్పుడే ఈ మేరకు ఎమ్మెల్సీ టికెట్‌పై కేసీఆర్ నుంచి హామీ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు టీఆర్‌ఎస్‌లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ‘భరించే’ నేతల సంఖ్య కూడా తక్కువగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నపరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాలు ప్రకటించడం లాంఛనప్రాయమేననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
గవర్నర్ కోటాలో ‘నేతి’
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్న నేతి విద్యాసాగర్ పదవీకాలం వచ్చే నెల ఒకటో తేదీతో ముగియనుంది. ఆయన ప్రస్తుతం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, ఆయనకు ఈసారి స్థానిక సంస్థల కోటాలో కాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, డిప్యూటీ చైర్మన్ హోదాను కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. తొలుత ఆయనను ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపాలనుకున్నా ఆ తర్వాత కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్న నేతిని మళ్లీ ఎన్నికలకు పంపకుండా, గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో విద్యాసాగర్ మరోసారి మండలికి వెళ్లనున్నారు.
‘నామినేటెడ్’ పందేరంపై బోలెడాశలు
మరోవైపు నామినేటెడ్ పోస్టులను రెండు నెలల్లోపు భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ చెప్పడంతో జిల్లా నేతల్లో నామినేటెడ్ పోస్టులపై ఆశలు ఊపందుకున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమయిన నాటి నుంచి ఉన్న నేతలు, మధ్యలో వచ్చి ఉద్యమంలో పాలుపంచుకున్న నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారు... ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో నామినేటెడ్‌పోస్టులను ఆశిస్తోన్న టీఆర్‌ఎస్ నేతల జాబితా చాంతాడంత ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల నుంచి డెరైక్టర్లు, మార్కెట్‌కమిటీ చైర్మన్లు.. ఇలా అనేక రకాల పదవులను ఎవరి స్థాయిలో వారు ఆశిస్తున్నారు. ఇందుకోసం అటు ముఖ్యమంత్రి, ఇటు జిల్లా మంత్రిని ప్రసన్నం చేసుకునే పనులను ఇప్పటికే ప్రారంభించారు. అయితే, జిల్లా నాయకత్వంపై సీఎం ఏ మేరకు కరుణ చూపుతారు.. ఎంత మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడతారనేది వేచిచూడాల్సిందే.
రెడీ..1..2..3
Published Sun, Apr 26 2015 12:45 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement