ఎస్సీ కాలనీలో నివాసాల మధ్య నిలిచిన మురుగు, కురుమర్తిలో ఓ వీధిలో పారుతున్న మురుగు
కట్టంగూర్ : మండలంలోని కురుమర్తి గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు నివాసాల మధ్య నిల్వ ఉండడంతో ప్రజలు రోడ్డు వెంట వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని బస్‌స్టాప్ నుంచి ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రహదారి వెంబడి నిర్మించిన డ్రెయినేజీ పూర్తిగా మట్టితో నిండిపోయింది. ఎస్సీ కాలనీలో డ్రెయినేజీ లేకపోవటంతో రోడ్డుపై మురుగు నిలిచి నెలరోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో దుర్వాసన వెదజల్లుతూ ఈగలు, దోమలకు ఆవాసంగా మారింది. ప్రజలకు రోగాల బారిన పడుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్ల వెంబడి డ్రెయినేజీలు నిర్మించకపోవటంతో ఇళ్లలోని మురుగు రోడ్డుపై నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిత్యం కురుమర్తి నుంచి మునుకుంట్ల గ్రామానికి, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
డ్రెయినేజీలు నిర్మించాలి
గ్రామంలో డ్రెయినేజీలు నిర్మించకపోవటంతో మురుగు నివాసాల మధ్య నిల్వఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కురుమర్తి నుంచి మునుకుంట్లకు వెళ్లే దారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. డ్రెయినేజీలు నిర్మించి సమస్యను పరిష్కరించాలి.
Comments
Please login to add a commentAdd a comment