మాయదారి మందులు!
పేరు, రంగు, రుచి, వాసన, ప్యాకింగ్... ఇవన్నీ చూడడానికి అచ్చం ఔషధాలుగానే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా వైద్యులు.. ఈ బాటిళ్లలో ద్రవపదార్థం తాగాలంటూ, ఈ గోలీలు మింగాలంటూ రోగులకు ప్రిస్కిప్షన్స్ రాస్తుంటారు. 200 రకాలుగా ఉన్న ఈ బాటిళ్లు, బిళ్లలు మెడికల్ షాపుల్లో తప్ప... ఎక్కడా దొరకవు.
ప్రమాణాల ప్రకారం ఇవి ఔషధాలు కావు... కేవలం ఆహార పదార్థాలు. విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నా.. ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా నాణ్యత లేని పదార్థాలను మెడికల్ షాపుల నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఒక్కసారి రోగం వస్తే వైద్య సేవల కింద సామాన్యుల జీవితాలు అతలాకుతలం అవుతుండడంతో ఔషధాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ చట్టం కింద 384 మందులు ఉన్నాయి. ఈ మందులన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు సాగించాలి. దీంతో ఈ చట్టం పరిధి నుంచి తప్పించుకునేందుకు పలువురు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్-2006 చట్టం పరిధిలో లెసైన్సులు తెచ్చుకుంటున్నారు.
ఈ ముసుగులో బలవర్థక ఆహారం పేరుతో కొన్ని ఔషధ కంపెనీలు మందులు తయారు చేస్తూ ఇష్టారీతిగా ధరలు నిర్ణయిస్తూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాయి. ఒంటికి బలాన్ని చేకూర్చే ఆహారం అనే పేరుతో సిరప్, టానిక్, ట్యాబెట్ల అమ్మకాలను యథేచ్చగా సాగిస్తున్నాయి. ఇలా తయారైన సిరప్‌లు, మల్టీ విటమిన్లు మార్కెట్‌లో మెడికల్ షాపుల్లో జోరుగా అమ్ముడవుతున్నాయి. కానీ.. ఔషధ ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు, ధరల నియంత్రణను పట్టించుకోవడం లేదు. మామూళ్లు అందుతుండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఔషధాల ధరలు చుక్కలను తాకుతున్నాయి.
ఒక్కరికీ అనుమతి లేదు...
నిబంధనల ప్రకారం ఫుడ్ సెఫ్టీ చట్టం లెసైన్స్‌తో తయారైన మందులు మెడికల్ షాపుల్లో విక్రయించాలంటే తప్పని సరిగా ఫుడ్ లెసైన్స్ తీసుకోవాలి. ఈ మేరకు 2013లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో భాగంగారిజిస్ట్రేషన్‌కు రూ.100, లెసైన్స్‌కు రూ. 2 వేలుగా నిర్ధారించింది. మన జిల్లాలో 2,100 మెడికల్ షాపులు ఉన్నాయి. ఆస్పత్రులకు అనుబంధంగా మరో 500పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క షాప్‌కూ ఆహార పదార్థాలు అమ్మే అనుమతి లేదు. అయినప్పటికీ ఈ ఉత్పత్తుల అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఫుడ్ సెఫ్టీ లెసైన్స్‌తో ఈ పదార్థాలు తయారు చేస్తున్నారు. వీటి నాణ్యత, ప్రమణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఫుడ్ ఇన్స్‌పెక్టర్లది. జిల్లాలో ఒక్కసారి కూడా ఇలాంటి ఉత్పత్తులను వారు పట్టించుకున్న పరిస్థితి లేదు.
అటాచ్‌డ్ షాపుల్లో అధికం...
ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం అజామాయిషీ ఉండడంతో వీటి ధరలు నిర్ధారించిన మేరకు ఉంటున్నాయి. దీంతో డాక్టర్లు, మెడికల్ షాపు యజమానులకు కమీషన్లు తక్కువగా వస్తున్నాయి. ఆహార పదార్థాల పేరుతో అమ్ముడయ్యే ఔషధాల ధరల నియంత్రణ లేదు. ఇదే అదునుగా ఫుడ్ లెసైన్స్‌తో అమ్మకాలు సాగిస్తున్న ఔషధాల ధరలు చుక్కల్లో ఉంటున్నాయి. అధిక ధరలు నిర్ణయిస్తున్నారు. వచ్చే లాభా ల్లో డాక్టర్లకు ఎక్కువ శాతం వాటాలు ఇస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ షాపు లు కేంద్రంగా ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతోం ది. ఇక్కడికి వచ్చే రోగులు అదే ఆస్పత్రిలో మందు లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో రోగులకు ఈ ఉత్పత్తులను ఎక్కువగా అంటగడుతున్నారు.