డ్రగ్ రాకెట్ గుట్టురట్టు
- నైజీరియన్‌తో పాటు వర్థమాన సినీ హీరో అరెస్టు
- 15 గ్రాముల కొకైన్ స్వాధీనం
యాకుత్‌పురా, న్యూస్‌లైన్: నైజీరియన్‌తో కలిసి గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు విక్రయిస్తూ వర్థమాన సినీ హీరో ఎన్. ఉయ్‌కిరణ్ (29) పోలీసులకు చిక్కాడు. ఇతనితో పాటు నైజీరియన్‌ను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి.. 15 గ్రాముల కొకైన్ (డ్రగ్) ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ బి.లింబారెడ్డి, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్‌తో కలిసి నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు.
నైజీరియా దేశానికి చెందిన రోటిని ఓలుసోలా కెహండే అలియాస్ సోలా (29) 2009లో బిజినెస్ వీసాపై నగరానికి వచ్చాడు. లోతుకుంట ఎంప్లాయీస్ కాలనీలో నివాసముం టున్నాడు. ఢిల్లీలో ఉంటున్న సూడాన్ దేశస్తుడు హకీం వద్ద ఇతను కొకైన్ (మాదకద్రవ్యం) డ్రగ్‌ను గ్రాము రూ. 1500లకు కొనుగోలు చేస్తున్నాడు. దానిని నగరానికి తెచ్చి వినియోగదారుల డిమాండ్‌ను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు చొప్పున విక్రయిస్తున్నాడు.
తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్న ఇతను ఎస్సార్‌నగర్ ఎల్లారెడ్డి విష్ణు హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వర్థమాన సినీ నటుడు నందూరి ఎన్. ఉదయ్ కిరణ్‌ను కలిశాడు. ఇద్దరూ కలిసి కొంతకాలంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, గోవా ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారు. వీరి వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం 11.30కి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఉదయ్‌కిరణ్, కెహండేలను అరెస్టు చేశారు.
వీరి వద్ద నుంచి 15 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను పరీక్షల నిమిత్తం సీసీఎస్ కు అప్పగించారు. ఢిల్లీకి చెందిన హకీంను పట్టుకొనేందుకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేసినట్టు అదనపు డీసీ పీ లింబారెడ్డి తెలిపారు. ప్రతిసారి నైజీ రియన్ దేశస్తులే మాదక ద్రవ్యాలు వి క్రయిస్తూ పట్టుబడుతుండటంతో వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
వీసాను పొడిగించుకుంటూ...
2009 నుంచి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నైజీరియన్ కెహండే తన వీసా గడువును ప్రతి సంవత్సరం పొడిగించుకుంటూ నగరంలోనే ఉంటున్నాడు.
హీరోగా రాణింపులేక...
నటుడు ఎన్. ఉదయ్‌కిరణ్ స్వస్థలం తూర్పుగోదావరిజిల్లా కాకినాడ. ఇతను పరారే, రక్షకుడు, యువరాజ్యం, ఫేస్‌బుక్ చిత్రాల్లో హీరోగా నటించాడు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇతను మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.