సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఏ సమయంలో ఎప్పుడైనా ఓఆర్‌ఆర్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో గత రెండువారాల నుంచి డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం తాగి వాహనం నడుపుతున్న 154 మంది వాహన చోదకులపై కేసులు నమోదు చేశారు. ఇదే విధానాన్ని ఓఆర్‌ఆర్‌లో ప్రతిరోజూ సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మద్యం తాగి ఓఆర్‌ఆర్‌పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా చతుర్ముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్‌ఆర్‌పై డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెడుతున్నారు. 156.9 కిలోమీటర్ల పరధిలోని ఓఆర్‌ఆర్‌లో గతేడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందగా, 66 మంది గాయపడ్డారు.
వేగం తగ్గించినా మారని తీరు...
గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిసూ ఏడాదిన్నర క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. అతి వేగం కారణంగా వాహనాల్లో సేఫ్టీ మేజర్స్ కూడా పనిచేయడం లేదు. ఓఆర్‌ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రాణ నష్టానికి కారణమవుతోంది.
ఆయా రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదురుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగాన్ని నియంత్రించేందుకు స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి వాహనం నడపడం కూడా వేగానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. అటు స్లో స్పీడ్ లేజర్ గన్ కెమరాలు, ఇటు డ్రంకన్ డ్రై వ్ తనిఖీలతో ఓఆర్‌ఆర్‌ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చాలనుకుంటున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. రోజువారీగా ఓఆర్‌ఆర్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి మందుబాబులు ఆటకట్టించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment