
మహిళను వేధించిన డీఎస్పీపై వేటు
వికారాబాద్: ఓ మహిళా హోంగార్డును లైంగికంగా వేధించిన డీఎస్పీపై ఉన్నతాధికారులు వేటు వేశారు. సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పరిగికి చెందిన ఓ హోంగార్డు గతంలో మృతిచెందాడు. ఆయన భార్యకు ఉపాధి కల్పిస్తూ హోంగార్డు ఉద్యోగం ఇచ్చి అప్పటి ఎస్పీ రాజకుమారి విధుల్లో నియమించారు.
కొంతకాలం వరకు ఎస్పీ కార్యాలయంలో పనిచేసిన ఆ మహిళ 2 నెలల క్రితం పరిగి ఠాణాకు బదిలీ అయ్యారు. అయితే, తనను వికారాబాద్ ఏఆర్ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదికను డీజీపీ కార్యాలయానికి అందచేశారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ డీఎస్పీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గతంలో లక్ష్మీనారాయణ మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ పోలీస్‌గా అవార్డు తీసుకోవడం గమనార్హం.