రూ.5వేలు ఎస్‌ఐ ప్రాణాలు తీశాయా? | Dubbaka SI Chittibabu Commits suicide | Sakshi
Sakshi News home page

రూ.5వేలు ఎస్‌ఐ ప్రాణాలు తీశాయా?

Published Mon, Mar 6 2017 11:47 PM | Last Updated on Fri, May 25 2018 5:57 PM

రూ.5వేలు ఎస్‌ఐ ప్రాణాలు తీశాయా? - Sakshi

రూ.5వేలు ఎస్‌ఐ ప్రాణాలు తీశాయా?

చిట్టిబాబు ఆత్మహత్య వెనుక అసలు రహస్యం ఏంటి?
నెలనెలా డబ్బు ఇవ్వాలని చెప్పిన ‘సారు’
క్షేత్రస్థాయికి చేరవేసిన పోలీసు సిండికేటు గ్రూపు
డబ్బుల్వికపోవడంతోనే కక్షగట్టిన ఉన్నతాధికారి
ఆయనతో ఘర్షణ పడిన ఎస్‌ఐ
ఈ నేపథ్యంలోనే బలవన్మరణం


రూ.5వేలు దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు ఉసురు తీశాయా..? ఆయన ఆత్మహత్యకు రూ..5 వేలే కారణమా..? నెల నెలా ఆ డబ్బు ఇవ్వలేకనే చిట్టిబాబు అధికారులతో ఘర్షణ పడ్డారా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానమే వినిపిప్తోంది. ఒక్క చిట్టిబాబు ప్రాణాలు మాత్రమే కాదు.. ఈ రూ.5వేలు జిల్లాలో మరికొందరు ఎస్‌ఐలను బలి తీసుకునేలా ఉంది. ఉన్నతాధికారులు పోలీసు శాఖను ప్రక్షాళన చేయకపోతే యువ పోలీసు అధికారుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది.

సాక్షి, సిద్దిపేట : గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పోలీసుస్టేషన్‌ నుంచి ‘పెద్ద సారు’కు లిక్కర్‌ మామూళ్ల కింద నెలకు రూ.5 వేలు, 100 లీటర్ల డీజిల్‌ ఇవ్వాలనే చట్ట విరుద్ధమైన నిబంధన అమల్లోకి వచ్చింది. సిండికేటు గ్రూపులోని ఓ ఎస్‌ఐ, ఒక సీఐ ఈ నిబంధనను క్షేత్రస్థాయి ఎస్‌హెచ్‌ఓలకు, ఎస్‌ఐలకు చేరవేశారు. కొంతమంది ఎస్‌ఐలు దీన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. మరి కొంతమంది ఎస్‌ఐలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలిసింది. మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘన చేయడం లేదని, ఎమ్మార్పీ వయొలేషన్‌ లేకుండా వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేయడం కుదరదని, బలవంతం చేస్తే వ్యాపారులు ఏసీబీని ఆశ్రయిస్తే తమ భవిష్యత్తుకు నాశనం అవుతుందని కొందరు తెగేసి చెప్పినట్టు తెలిసింది.

ఎమ్మార్పీ ఉల్లంఘన లేకుంటే బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని, వాటి మీద దృష్టి సారించి, దాడులు చేసి వ్యాపారులను లొంగదీసుకోవాలని, సిండికేటు గ్రూపు పోలీసులు సలహా ఇచ్చినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగానే  బెల్టు దుకాణాలు మూసేయాలని  ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సెట్‌ కాన్ఫరెన్స్‌ల్లో బెల్టు దుకాణాలు, ఇసుక రవాణాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారని, క్రైం రివ్యూకు అతి తక్కువ సమయం కేటాయించే వారని తెలుస్తోంది. ఉన్నతాధికారి ఉద్దేశాన్ని అర్ధం చేసుకున్న కొంత ఎస్‌ఐలు గొడవలు ఎందుకులే అనే ఆలోచనతో రూ.5 వేల ఇచ్చి.. ‘సారు’ స్టేషన్‌ పర్యవేక్షణకు వచ్చిన ప్రతిసారీ వాహనంలో డీజిల్‌ పోసి చేతులు దులుపుకొన్నారు.

కాగా ఇందుకు నలుగురైదుగురు ఎస్‌ఐలు మాత్రం ఒప్పుకోనట్లు తెలిసింది. మొదటినుంచి చిట్టిబాబు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని మనుసులో పెట్టుకున్న సదరు ఆ జిల్లా అధికారి మండలంలో బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని, ఇసుక అక్రమ రవాణా నడుస్తుందని వీటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నామని సెట్‌ కాన్ఫరెన్స్‌లో నిలదీసినట్టు సహచర పోలీసుల ద్వారా తెలుస్తోంది.

 తన పోలీసుస్టేషన్‌ పరిధిలో ఎలాంటి బెల్టు దుకాణాలు నడవడం లేదని, దాదాపు 60 మందికిపైగా కేసులు పెట్టానని, అనుమతిస్తే పీడీ యాక్ట్‌ పెట్టడానికైనా సిద్ధమే అని ఆ ఉన్నతాధికారికి చెప్పినట్టు సమాచారం. దీన్ని మనుసులో పెట్టుకున్న పై అధికారి ఆయన శిక్షణ కోసం వెళ్లిన సమయంలో స్పెషల్‌ పార్టీ పోలీసులతో దుబ్బాక పోలీసుస్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో అదేపనిగా అన్వేషణ చేయించి, చివరికి తిమ్మాపూర్‌ అనే  గ్రామంలో ఒక గీత కార్మికుని ఇంట్లో ఉన్న మద్యం సీసాలు పట్టుకొని కేసు చేసినట్టు తెలిసింది. ఇదే ప్రధాన కారణంగా చూపిస్తూ చిట్టిబాబునును సస్పెండ్‌ చేసి సస్పెన్షన్‌ ఉత్తర్వులు తీసుకోవాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది.

ఇదే అంశాన్ని తను ఆత్మహత్య చేసుకోవటానికి కంటే మూడు గంటల ముందు ఎస్‌ఐ చిట్టిబాబు స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దృష్టికి తీసుకుపోయారని, సస్పెండైయితే తల ఎత్తుకోలేనని, తనను ఎలాగైనా కాపాడాలని కోరినట్టు తెలసింది. దీనిపై స్పందించిన రామలింగారెడ్డి తాను రాంసాగర్‌ గ్రామంలో ఉన్నానని, వెంటనే ఇక్కడకు రమ్మని, అవసరమైతే ఇక్కడి నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. తన భార్య సరోజను ఇంటి వద్ద దించేసి వస్తానని ఎమ్మెల్యేతో చెప్పినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇంతలోనే ఆయన తన భార్యను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా సదరు ఉన్నతాధికారి తల ఎగిరేసి నిలబడిన ఎస్‌ఐలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నామని కొందరు ఎస్‌ఐలు ఆందోళన చెందుతున్నారు.  ఉన్నతాధికారులను రక్షించేందుకు ప్రయత్నం చేయడంకంటే విచారణ అధికారులు వాస్తవ పరిస్థితులను వెలికితీసి పోలీసుశాఖను బతికించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement