అగ్రరాజ్యంలో యువశాస్త్రవేత్త
ఉద్యోగార్థిగా అమెరికా వెళ్లిన ఆయన అక్కడ అద్భుతాలు సృష్టిస్తున్నారు. వైద్యరంగంలో పరిశోధనలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ప్రతిభకు గుర్తుగా ఎన్నో పతకాలు.. మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఫిట్స్‌కు మందు కనుగొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆయన మరెవరో కాదు.. పరకాల మండలం చర్లపల్లికి చెందిన దూదిపాల సాంబరెడ్డి. ప్రతిష్టాత్మక తానా అవార్డును సైతం అందుకున్న ఆయన.. సొంతగడ్డపై మమకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పరకాల : అగ్రరాజ్యం అమెరికాలో మనోడు ప్రతిభ చాటుతున్నాడు. పల్లె నుంచి ఎదిగిన ఈ వైద్యరత్నం నేడు ప్రపంచస్థాయిలో పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్నాడు. కుగ్రామం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన ఆయన పేరు దూదిపాల సాంబరెడ్డి. వైద్యరంగంలో పరిశోధనలపై పట్టుసాధించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఆయన పరకాల మండలంలోని చర్లపల్లికి చెందిన రాధమ్మ, రాజిరెడ్డి దంపతుల నాలుగో సంతానం.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్న సాంబరెడ్డి 8,9 తరగతులను కరీంనగర్ జిల్లా మర్రిపల్లిగూడెంలో చదువుకున్నారు. రెండేళ్ల తర్వాత తిరిగి పరకాలకు చేరుకుని అక్కడే పదో తరగతి, ఇంటర్ పూర్తి పూర్తిచేశారు.1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ అభ్యసించారు. చదువులో విశేష ప్రతిభ కనబర్చి ఆరు బంగారు పతకాలు అందుకున్నారు. 1998లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
పల్లె నుంచి విదేశాలకు..
విద్యాభ్యాసం పూర్తిచేసిన సాంబరెడ్డి ఉద్యోగం కోసం1999లో అమెరికాకు పయనమయ్యారు. వాషింగ్టన్‌లోని ఎన్‌ఎంహెచ్‌లో డాక్టర్‌గా తన కెరీర్ ను ప్రారంభించారు. అక్కడ పనిచేస్తుండగానే నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పరిశోధనలు కొనసాగించారు. ప్ర స్తుతం టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయంలోని వైద్య కళాశాలలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు.
‘యువ ఆచార్యుడి’గా సత్కారం
వైద్యరంగంలో విశేష కృషి చేస్తున్న సాంబరెడ్డిని యూనివర్సిటీలోని వైద్యశాస్త్ర అధ్యాపకులు యువ ఆచార్యుడు బిరుదుతో సత్కరించారు. 16ఏళ్ల పరిశోధనల్లో 25కుపైగా రీసెర్చ్ ఎక్స్‌లెన్సీ అవార్డులు అందుకున్నారు. తన పరిశోధనల కృషి వల్ల 2013లో రీసెర్చ్ గ్రాంట్ కింద రూ.ఆరుకోట్లు అందుకున్నారు. సాంబరెడ్డి రాసిన వంద పరిశోధన వ్యాసాలు అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 150 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. ఆయన రాసిన ఫార్మసీ ఎంట్రన్స్, ఫార్మసీ క్విజ్ పుస్తకాలు బహుళ ప్రాచుర్యం పొందాయి.
‘తానా’ అవార్డుకు ఎంపిక
వైద్యరంగంలో అనేక పరిశోధనలు చేస్తూ ముందుకుసాగుతున్న సాంబరెడ్డిని అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తా నా) ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుకు ఎం పికచేసింది. మెదడుకు సంబంధించిన వ్యాధులు, మూర్చ(ఫిట్స్) నివారణ కోసం సాంబరెడ్డి మందులు కనుగొనడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2013 మే 24 నుంచి 26వ తేదీ వరకు ఉత్తర అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన 19వ తానా మ హాసభల్లో అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి, తానా అధ్యక్షుడు తోటకూరి ప్రసాద్ చేతుల మీ దుగా ఉత్తమ శాస్త్రవేత్త అవార్డును అందుకున్నారు.
పుట్టినగడ్డపై మమకారంతో..
వైద్యరంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి ప్రపంచ ఖ్యాతి సంపాదించుకున్న సాంబరెడ్డి పుట్టినగడ్డను మాత్రం మర్చిపోలేదు. పలుసేవా కార్యక్రమాలు చేపడుతూ పుట్టిన ఊరు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2005లో ఆయన రాసిన 50పరిశోధనా వ్యాసాలను తాను చదువుకున్న కాకతీయ విశ్వవిద్యాలయానికి అంకితమిచ్చారు. ఫార్మసీ అలుమ్ని బిల్డింగ్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. 2012 డిసెంబర్ 24న పరకాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి రూ.12లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు.
చర్లపల్లి గ్రామంలోనూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా మందులు అందించారు. ఏడు, పది తరగతుల్లో ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థులకు ప్రతిఏటా రూ.1500చొప్పున నగదు బహుమతి అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేకాక గ్రామంలోని శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ కోసం సిమెంట్ స్తంభాలు కొనుగోలు చేసి ఇచ్చారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో స్వదేశానికి వచ్చే సాంబరెడ్డి వరంగల్, హైదరాబాద్‌లోని కళాశాలల్లో ప్రసంగాలు ఇస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ సొంతగడ్డ రుణం తీర్చుకుంటున్న సాంబరెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.