Tana Award
-
తానా నవలల పోటీ... విజేతలు వీరే
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్వహించిన నవలల పోటీలో విశాఖపట్నంకి చెందిన చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు, అనంతపురానికి చెందిన బండి నారాయణస్వామి రాసిన అర్థనారి నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలిద్దరికి రెండు లక్షల రూపాయలను సమానంగా అందివ్వనున్నారు. అదే విధంగా ఈ నవలలను ప్రచురించే బాధ్యతలను తామే తీసుకుంటామని తానా కార్యవర్గం ప్రకటించింది. తానా ఆధ్వర్యంలో 1997 నుంచి నవలల పోటీలు జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల పాటు నవల, కథా పోటీలు నిరాటంకంగా జరిగాయి. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఈ పోటీలు నిర్వహించలేదు. తిరిగి 2017 నుంచి నవల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగిన నవలల పోటీకి మొత్తం 107 నవలు పరిశీలనకు వచ్చాయి. వీటిలో ఉత్తమంగా ఉన్న రెండు నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. -
New York : తానా సాహిత్య సదస్సు విజయవంతం
న్యూయార్క్, జూన్ 27 తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జూన్ 27న జరిగిన వర్చువల్ సమావేశంలో “ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా విజ్ఞాన సదస్సు విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షలు జయశేఖర్ తాళ్లూరి తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ, పర్వ్యాప్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి తానా ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “విద్యాలయాలలో విద్య ‘లయ’ తప్పుతోందని, పలు రాష్ట్రాలలో పాలకుల విద్యా విధానాలు శ్రుతి మించి ‘రోగాన’ పడుతున్నాయని, చాలా విశ్వవిద్యాలయాలలో తరచూ సిబ్బందిలో వచ్చే ఖాళీలను భర్తీ చేయకుండా, విద్యార్దులను ఇబ్బందికి గురి చేస్తున్నారని, భర్తీ చేసినా మొక్కుబడిగా వారిని తాత్కాలికంగా నియమిస్తూ, అరకొరా వేతనాలు ఇస్తూ భోదించే అధ్యాపకులే లేని అధ్వాన్న పరిస్థితులలోకి నెడుతున్నానారని, విద్యాలయాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వ విద్యాలయాలతో విశ్వానికే దిశానిర్దేశం చేసి మార్గదర్శకంగా నిలచిన మన భారతదేశంలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. విశాఖపట్నానికి చెందిన, ఆంధ్రవిశ్వవిద్యాలయం లో చదువుకున్న ఆచార్య డా. నీలి బెండపూడిఅమెరికా దేశంలో కెంటకీ రాష్ట్రంలో 223 సంవత్సరాల చరిత్ర, 120 కోట్ల రూపాయల వార్షిక ఆదాయ వ్యయం,3,000 కు పైగా సిబ్బంది, 22,000 మంది విద్యార్ధులకు నిలయమైన లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి)గా ఎన్నికగావడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయమంటూ డా. ప్రసాద్ తోటకూర ఆమెను ఈ సభకు ప్రత్యేక అతిధిగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులతి) ఆచార్య డా. నీలి బెండపూడి తెలుగు భాష మాధుర్యాన్ని, సాహిత్యపు విలువలని, ఎంతోమంది సాహితీవేత్తల కృషిని,అమెరికా దేశంలో గత 40 సంవత్సరాలుగా తానా చేస్తున్న కృషిని కొనియాడుతూ తాను ఏదేశంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, భారతీయురాలిగా, తెలుగు వ్యక్తిగా గుర్తించబడడం తనకు గర్వకారణం అంటూ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. తంగెడ కిషన్‌రావు ఈ సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖాధ్యక్షులతో వేదిక పంచుకోవడం ఆనందదాయకంగా ఉందని, వివిధ సాహితీ సంస్థలు, సాహితీ ప్రియులు, తానా లాంటి పలు సంస్థలతో కలిసి పనిచేస్తూ తెలుగు విశ్వవిద్యాలయంలో అనేక జాతీయ, అంతర్జాతీయ తెలుగు సమావేశాలు నిర్వహించాలనే ఆసక్తి ఉన్నట్లుగా తెలియపరిచారు. తెలుగు భాష, సాహిత్యం, కళల అభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం విశేషంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉందని ప్రకటించారు. మైసూరు విశ్వవిద్యాలయం, మైసూరు పూర్వ తెలుగు శాఖాసంచాలకులు ఆచార్య డా. ఆర్.వి.ఎస్. సుందరం; ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు యోజన నిర్దేశకులు ఆచార్య డా. దిగుమర్తి మునిరత్నం నాయుడు;మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. విస్తాలి శంకర్ రావు; ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆలిఘర్ తెలుగు శాఖాధ్యక్షులు సహాయ ఆచార్యులు డా. పటాన్ ఖాసిం ఖాన్; మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, మధురై తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. జొన్నలగడ్డ వెంకట రమణ; బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య డా. కొలకలూరి ఆశాజ్యోతి; ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. గంప వెంకట రామయ్య; కర్ణాటక రాజ్య సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు తెలుగు శాఖాధిపతి ఆచార్య డా. మొగరాల రామనాథం నాయుడు; బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి తెలుగు శాఖాచార్యులు ఆచార్య డా. భమిడిపాటి విశ్వనాథ్ లు తమ తమ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖ ఆవిర్భావం, జరుగుతున్న అభివృద్ధి, తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా రంగాలలో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యక్రమాలను, ప్రభుత్వాల నుండి ఇంకా అందవలసిన సహాయ సహకారాల అవసరాలను సోదాహరణంగా వివరించారు. హాస్యావధాని, ప్రముఖ పాత్రికేయులు హాస్య బ్రహ్మ డా. టి. శంకర నారాయణ తన హాస్య ప్రసంగంలో విశ్వనాధ సత్యనారాయణ, గుర్రం జాషువా, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీశ్రీ, ఆరుద్ర, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి లాంటి సాహితీవేత్తల జీవితాల్లోని హాస్య సంఘటలను వివరించి సభను నవ్వులతో ముంచెత్తారు. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా తానా నిర్వహిస్తున్న సాహితీ సమావేశాలతో పోల్చుకుంటే ఇదొక ప్రత్యేక సాహిత్య సమావేశమని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేయడంలో సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అగ్రరాజ్యంలో యువశాస్త్రవేత్త
ఉద్యోగార్థిగా అమెరికా వెళ్లిన ఆయన అక్కడ అద్భుతాలు సృష్టిస్తున్నారు. వైద్యరంగంలో పరిశోధనలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ప్రతిభకు గుర్తుగా ఎన్నో పతకాలు.. మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఫిట్స్‌కు మందు కనుగొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆయన మరెవరో కాదు.. పరకాల మండలం చర్లపల్లికి చెందిన దూదిపాల సాంబరెడ్డి. ప్రతిష్టాత్మక తానా అవార్డును సైతం అందుకున్న ఆయన.. సొంతగడ్డపై మమకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పరకాల : అగ్రరాజ్యం అమెరికాలో మనోడు ప్రతిభ చాటుతున్నాడు. పల్లె నుంచి ఎదిగిన ఈ వైద్యరత్నం నేడు ప్రపంచస్థాయిలో పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకున్నాడు. కుగ్రామం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన ఆయన పేరు దూదిపాల సాంబరెడ్డి. వైద్యరంగంలో పరిశోధనలపై పట్టుసాధించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఆయన పరకాల మండలంలోని చర్లపల్లికి చెందిన రాధమ్మ, రాజిరెడ్డి దంపతుల నాలుగో సంతానం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్న సాంబరెడ్డి 8,9 తరగతులను కరీంనగర్ జిల్లా మర్రిపల్లిగూడెంలో చదువుకున్నారు. రెండేళ్ల తర్వాత తిరిగి పరకాలకు చేరుకుని అక్కడే పదో తరగతి, ఇంటర్ పూర్తి పూర్తిచేశారు.1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ అభ్యసించారు. చదువులో విశేష ప్రతిభ కనబర్చి ఆరు బంగారు పతకాలు అందుకున్నారు. 1998లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. పల్లె నుంచి విదేశాలకు.. విద్యాభ్యాసం పూర్తిచేసిన సాంబరెడ్డి ఉద్యోగం కోసం1999లో అమెరికాకు పయనమయ్యారు. వాషింగ్టన్‌లోని ఎన్ఎంహెచ్లో డాక్టర్‌గా తన కెరీర్ ను ప్రారంభించారు. అక్కడ పనిచేస్తుండగానే నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పరిశోధనలు కొనసాగించారు. ప్ర స్తుతం టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాలయంలోని వైద్య కళాశాలలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. ‘యువ ఆచార్యుడి’గా సత్కారం వైద్యరంగంలో విశేష కృషి చేస్తున్న సాంబరెడ్డిని యూనివర్సిటీలోని వైద్యశాస్త్ర అధ్యాపకులు యువ ఆచార్యుడు బిరుదుతో సత్కరించారు. 16ఏళ్ల పరిశోధనల్లో 25కుపైగా రీసెర్చ్ ఎక్స్‌లెన్సీ అవార్డులు అందుకున్నారు. తన పరిశోధనల కృషి వల్ల 2013లో రీసెర్చ్ గ్రాంట్ కింద రూ.ఆరుకోట్లు అందుకున్నారు. సాంబరెడ్డి రాసిన వంద పరిశోధన వ్యాసాలు అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 150 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. ఆయన రాసిన ఫార్మసీ ఎంట్రన్స్, ఫార్మసీ క్విజ్ పుస్తకాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ‘తానా’ అవార్డుకు ఎంపిక వైద్యరంగంలో అనేక పరిశోధనలు చేస్తూ ముందుకుసాగుతున్న సాంబరెడ్డిని అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తా నా) ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుకు ఎం పికచేసింది. మెదడుకు సంబంధించిన వ్యాధులు, మూర్చ(ఫిట్స్) నివారణ కోసం సాంబరెడ్డి మందులు కనుగొనడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2013 మే 24 నుంచి 26వ తేదీ వరకు ఉత్తర అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన 19వ తానా మ హాసభల్లో అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి, తానా అధ్యక్షుడు తోటకూరి ప్రసాద్ చేతుల మీ దుగా ఉత్తమ శాస్త్రవేత్త అవార్డును అందుకున్నారు. పుట్టినగడ్డపై మమకారంతో.. వైద్యరంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి ప్రపంచ ఖ్యాతి సంపాదించుకున్న సాంబరెడ్డి పుట్టినగడ్డను మాత్రం మర్చిపోలేదు. పలుసేవా కార్యక్రమాలు చేపడుతూ పుట్టిన ఊరు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2005లో ఆయన రాసిన 50పరిశోధనా వ్యాసాలను తాను చదువుకున్న కాకతీయ విశ్వవిద్యాలయానికి అంకితమిచ్చారు. ఫార్మసీ అలుమ్ని బిల్డింగ్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. 2012 డిసెంబర్ 24న పరకాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి రూ.12లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు. చర్లపల్లి గ్రామంలోనూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా మందులు అందించారు. ఏడు, పది తరగతుల్లో ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థులకు ప్రతిఏటా రూ.1500చొప్పున నగదు బహుమతి అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేకాక గ్రామంలోని శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ కోసం సిమెంట్ స్తంభాలు కొనుగోలు చేసి ఇచ్చారు. ప్రతి ఏడాది డిసెంబర్లో స్వదేశానికి వచ్చే సాంబరెడ్డి వరంగల్, హైదరాబాద్‌లోని కళాశాలల్లో ప్రసంగాలు ఇస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ సొంతగడ్డ రుణం తీర్చుకుంటున్న సాంబరెడ్డి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.