అధికారుల నిర్వాకం వల్లే..!
- ‘ఫోర్జరీ’ కేసులో కొత్తకోణం
- వెలుగులోకి జోనల్ కార్యాలయ అధికారుల చేతివాటం?
కుత్బుల్లాపూర్: ఫోర్జరీ పనుల కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. చేయని పనులకు సంబంధిత కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసే విషయంలో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని ఆడిట్, ఎగ్జామినర్, ఫైనాన్స్ అడ్వైజరీ (ఎఫ్‌ఏ) విభాగాల్లో పనిచేసే అధికారులు సహకరించారని విచారణలో వెలుగు చూసింది. జగద్గిరిగుట్టకు చెందిన కాంట్రాక్టర్ లక్ష్మణ్‌రాజు ఈ తతంగానికి తెర లేపారు. వీరికి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న ఉపేందర్‌రెడ్డి సహకరించినట్లు విచారణలో తేలింది.
మూడు బృందాలుగా సీఐ చంద్రశేఖర్, ఎస్సై లింగ్యానాయక్‌లు చేపట్టిన విచారణలో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేసే అధికారుల నిర్వాకం వల్లే ఈ ఫోర్జరీ పనుల బాగోతం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంట్రాక్టర్లకు 60 (రూ.24 లక్షలు) శాతం, అధికారులకు 40(రూ.16 లక్షలు) శాతం సొమ్ము ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని, వీరికి మధ్యవర్తిగా ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వ్యవహరించారని తెలుస్తోంది.
తెలియక తప్పు చేశాం.. డబ్బులు వెనక్కి ఇస్తాం
ఫోర్జరీ బాగోతంపై అధికారులు ఆరుగురు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ (నిషేధిత జాబితా)లో చేర్చడంతో పాటు డ్రా చేసిన మొత్తాన్ని వెంటనే వాపస్ చేయాలని ఈ నెల 6 న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన నలుగురు కాంట్రాక్టర్లు తాము చేసింది తప్పేనంటూ, డబ్బులు వాపస్ ఇస్తామని తాజాగా శనివారం ఇన్‌వార్డు సెక్షన్‌లో లిఖిత పూర్వకంగా లేఖలు అందజేశారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం తాము ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఫోర్జరీ సృష్టికర్త లక్ష్మణ్‌రాజు 2012-14 సంవత్సరాల్లో చేసిన పనుల్లో కూడా అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కాగా కాంట్రాక్టర్లు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం కోర్టుచుట్టూ చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది.
వర్క్‌ఇన్‌స్పెక్టర్ల బదిలీ
ఫోర్జరీ పనుల బాగోతంపై స్పందించిన జోనల్ కమిషనర్ హరిచందన..ఇంజనీరింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను సికింద్రాబాద్, అల్వాల్, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను అల్వాల్, మల్కాజ్‌గిరి లకు బదిలీ చేయగా తాజాగా 16 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు.