నకిలీలలు | duplicate affairs | Sakshi
Sakshi News home page

నకిలీలలు

Published Wed, Mar 7 2018 11:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

duplicate affairs - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:   పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో కొందరు దారి తప్పిన వారు వస్తున్నారు.. ఉపాధ్యాయులను దైవంతో సమానంగా కొలిచే ఈ సమాజంలో కొందరు ఆ వృత్తికి వ్యక్తులు మాయని మచ్చ తెస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఉపాధ్యాయ కొలువులను సాధించిన వారి బాగోతాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అర్హత లేకపోయినా అక్రమ మార్గంలో కొలువులు పొందిన ‘దొంగ’ టీచర్లకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే గండేడ్‌ మండలానికి చెందిన 10 మంది ఉపాధ్యాయులు సర్వీస్‌ నుంచి తొలగించారు. అయితే తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో 84 మంది నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు సాధించినట్లు వెలుగు చూసింది. వీరిపై ఫిర్యాదులు అందడంతో విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
 
అత్యాశ... అక్రమ మార్గం 
ప్రస్తుతం సర్కారు ఉద్యోగానికి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ ఉపాధ్యాయ పోస్టుకు ఉన్న పోటీ మరేదానికి ఉండదు. అయితే కొందరు అక్రమార్కులు తమ నేర ప్రవృతిని ఉపయోగించి తప్పుడు ధ్రువపత్రాల ద్వారా అర్హులకు తీరని అన్యాయం చేశారు. తాజాగా వారి అక్రమాలు ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందు రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగమైన గండేడ్‌ మండలంలో నకిలీ టీచర్ల బాగోతం బయటపడింది. ఒక్క గండేడ్‌ మండలంలోనే దాదాపు 52 మంది నకిలీలు తిష్టవేశారు.

వైకల్యం లేకపోయినా ఉన్నట్లుగా చూపించడం, తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు, స్థానికేతురులైనా.. స్థానికులుగా చూపించి కొలువులు కొట్టేశారు. వీరి బాగోతం బయటపడగా విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆస్పత్రుల నుంచి పొందిన సర్టిఫికెట్లతో పాటు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పొందిన కులధ్రువీకరణ పత్రాలు సైతం నకిలీవేనని బయటపడింది. ఈ విషయం కాస్త కాస్తానిర్దారణ కావడంతో 10 మంది ఉపాధ్యాయులను సర్వీస్‌ నుంచి తొలగించారు. 

కూపీ లాగితే... 
గండేడ్‌ మండలంలో వెలుగు చూసిన దొంగ కొలువుల వ్యవహారం నేపథ్యంలో మరింత కూపీ లాగితే మరికొందరి బాగోతం బయటపడుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా చెవి, ముక్కు, గొంతు వ్యాధి ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు పొందుపరిచి ఉద్యోగాలు సాధించిన వారి పేర్లు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా 2002 నుంచి 2012 వరకు జరిగిన డీఎస్సీల్లో పీహెచ్‌సీ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను తెలంగాణ సమాచార హక్కుల వేదిక వెలికి తీసింది. గతంలో గండేడ్‌ మండలంలో 52 మంది బాగోతాలు వెలుగు చూడగా... తాజాగా మరో 84 మంది ఉన్నట్లు బయటకొచ్చింది. నకిలీ ఉపాధ్యాయులకు సంబంధించి సరిగ్గా నెల క్రితం వరకు 24 మంది ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 60.. ఆపై 84 చేరింది. దీనిపై తెలంగాణ సమాచారం హక్కుల వేదిక బాధ్యులు డీఈఓతో పాటు జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.  

ఎక్కడెక్కడ... 
నకిలీ సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారు ఉమ్మడి జిల్లాలో 84 మంది ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదు అందాయి. అందులో మక్తల్‌ మండలంలో 14 మంది, మహబూబ్‌నగర్‌ మండలంలో ఎనిమిది మంది, నర్వలో నలుగురు,  ఊట్కూరు, మాగనూరు, అడ్డాకుల, బాలానగర్, హన్వాడలో ముగ్గురు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా దేవరకద్ర, కొల్లాపూర్, గండీడ్, నవాబ్‌పేట, జడ్చర్ల, వెల్దండ, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, వనపర్తి, మాడ్గుల, తలకొండపల్లి, వీపనగండ్ల, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరేసి చొప్పున, నారాయణపేట, కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు, తిమ్మాజిపేట, వంగూరు, కోడేరు, ఖిల్లాఘనపురం, గద్వాల, గట్టు, ధరూరు, గోపాల్‌పేట, ధన్వాడ, కల్వకుర్తి, కోయిల్‌కొండ, ఉప్పునుంతలల్లో ఒకరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆయా ఉపాధ్యాయుల విషయమై ప్రత్యేక అధికారులు విచారణ చేపడుతారు. 

విద్యాశాఖ నిర్ణయాల మేరకు నిర్ణయం 
నకిలీ ఉపాధ్యాయులు ఉన్నారంటూ తెలం గాణ సమాచార హక్కుల వేదిక ఆధ్వర్యాన ఫిర్యాదు చేశా రు. ఇటీవలి కాలంలో వివిధ మండలాలకు చెందిన 24 మంది పేర్లను అందజేశారు. అలాగే తాజాగా మరో 60 మంది పేర్లు ఇచ్చారు. వీరందరిపై విచారణ జరుపుతున్నాం. పీహెచ్‌సీ కోటాలో ఉద్యోగాలు సాధించిన వారి విషయమై మెడికల్‌ బోర్డు కు లేఖ రాశాం. డీఎస్సీ సందర్భంగా వారు అందజేసిన సర్టిఫికెట్లు వాస్తవమా, కాదా అని తేల్చాలని కోరాం. అక్కడి నుంచి నివేదిక రాగానే విద్యాశాఖ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. గతంలో సర్వీస్‌ నుంచి తొలగించిన పది మంది విషయంలోనూ ఇదే పద్ధతి పాటించాం.  
– సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement