సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైన దుర్గాదేవి ప్రతిమల అవశేషాలను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వినాయక నిమజ్జనం అనంతరం సాగర్ జలాశయాన్ని వడపోసిన అధికారులు ఇప్పుడు దుర్గాదేవి నిమజ్జన వ్యర్థాలను వెలికితీసేందుకు మరోసారి సాగర మథనానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా ఆదివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభి వ్యర్థాల తొలగింపు పనులు ముమ్మరం చేశారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 8 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనమైన దుర్గాదేవి ప్రతిమల శకలాలతోపాటు బతుకమ్మలు, ఇతర చెత్తాచెదారాన్ని వెలికితీసి కవాడిగూడలోని జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. మెట్రో పొలిస్ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు సాగర్‌ను సందర్శించే అవకాశం ఉండటంతో జలాశయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
ఆదివారం సాయంత్రం వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి దుర్గాదేవి ప్రతిమలు నిమజ్జనానికి తరలిరావడంతో వాటికోసం 4 ప్లాట్‌ఫారాలు కేటాయించి మిగతా 4 ప్లాట్‌ఫారాల వద్ద వ్యర్థాల తొలగింపు పనులు చేపడుతున్నారు. మొత్తం 8 ప్లాట్‌ఫారాల వద్ద సుమారు రెండు వేల టన్నులకుపైగా వ్యర్థాలు ఎన్టీఆర్ మార్గ్ వైపు పోగైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యర్థాలను సోమవారం సాయంత్రం వరకు తొలగించాలన్న లక్ష్యంతో పనులు నిర్వహిస్తున్నట్టు సంబంధిత
అధికారి ఒకరు తెలిపారు.
నిరంతరాయంగా పనులు..
దుర్గాదేవి నిమజ్జన వ్యర్థాలను తొలగించే పనులను నిరంతరాయంగా కొనసాగించేలా ఇంజినీరింగ్ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఆదివారం సుమారు 100 మంది కూలీలు, 10 టిప్పర్లు, 3 జేసీబీలు, 3 డీయూసీలను వినియోగించి సాయంత్రానికల్లా సుమారు 600 టన్నుల వ్యర్థాలను తొలగించారు. ప్రక్షాళన పనుల్లో మరింత వేగం పెంచేందుకు సోమవారం 150 మంది కూలీలు, 10 టిప్పర్లు, 3 డీయూసీలు, 3 జేసీబీలను వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
షిఫ్టుల వారీగా అహర్నిశలు ప్రక్షాళన పనులు నిర్వహించి సోమవారం రాత్రి వరకు పూర్తి చే యాలన్న లక్ష్యంతో పనులు సాగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్డ్ వైపు ఫుట్‌పాత్‌పై పోగైన చెత్తా చెదారాన్ని జీహెచ్‌ఎంసీ తరలిస్తుండగా, సాగర్‌లో నిమజ్జన వ్యర్థాలను మాత్రం హెచ్‌ఎండీఏ తొలగిస్తోందని బీపీపీ అధికారులు స్పష్టం చేశారు.
ఐరన్ కోసం ఆరాటం..
నిమజ్జన విగ్రహాల తాలూకు ఇనుము (స్క్రాప్)ను దక్కించుకొనేందుకు పలువురు పోటీ పడటం కన్పించింది. స్క్రాప్‌ను ఎంత చేజిక్కించుకొంటే... అంత ఆదాయం వస్తుందన్న ఆరాటంతో కొందరు యువకులు పీకల్లోతు నీటిలోకి వెళ్లి విగ్రహాల నుంచి చేతనైనంత స్క్రాప్‌ను సేకరిస్తున్నారు. అధిక శ్రమకోర్చి దాన్ని గట్టుకు చేర్చి తీసుకె ళ్తున్నారు. వీరితోపాటు అక్కడి క్రేన్ వద్ద పనిచేస్తున్న కూలీలు, వివిధ బస్తీల నుంచి వచ్చిన నిరుపేదలు కూడా స్క్రాప్‌ను సేకరించేందుకు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. దీంతో సాగర్‌లో ఎన్టీఆర్ మార్గ్ వైపు ఆదివారం సాయంత్రం కోలాహలంగా కన్పించింది.
మళ్లీ ‘సాగర్’ మథనం!
Published Mon, Oct 6 2014 12:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM
Advertisement
Advertisement