విధులు అక్కడ.. వేతనం ఇక్కడ | duties are there .. here wage | Sakshi
Sakshi News home page

విధులు అక్కడ.. వేతనం ఇక్కడ

Published Sat, Jul 26 2014 2:29 AM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM

duties  are there  .. here wage

ఏటూరునాగారం : ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తే అక్కడే వేతనం తీసుకోవడం రివాజు. అయితే ఐటీడీఏలో మాత్రం ఏక్కడ పనిచేసినా అధికారులు ఇక్కడే వేతనం చెల్లిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 భద్రాచలం ఏఓగా పనిచేస్తున్న హరిప్రసాద్, కాకినాడలోని ఐటీడీఏ కార్యాలయంలో డీఎస్‌ఓగా పనిచేస్తున్న వి.సూర్యప్రభాకర్‌రావుకు 2011 జూలై 28న ఒకేసారి ఏపీఓ జనరల్‌గా ప్రమోషన్ ఇస్తూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సూర్యప్రభాకర్‌రావును ఐటీడీఏ ఏటూరునాగారం, హరిప్రసాద్‌ను పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రపురం(ఆర్‌కేపురం)లోని ఐటీడీఏకు బదిలీ చేసింది. అయితే సూర్యప్రభాకర్‌రావు 2011 ఆగస్టు 1న ఏటూరునాగారం ఐటీడీఏలో  విధుల్లో చేరగా హరి ప్రసాద్ ఆర్‌కేపురానికి వెళ్లడం ఇష్టం లేక భద్రాచలంలోనే ఉండిపోయారు.

 వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ కమిషనర్ శాంతికుమారిని 2011 సెప్టెంబర్ 2 కలుసుకుని మ్యాచువల్ డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు అనుమతి ఇప్పించాలని వేడుకోగా 2011 సెప్టెంబర్ 30న తాత్కాలిక వర్కింగ్ అడ్జెస్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సూర్యప్రభాకర్‌రావు ఇక్కడి నుంచి 2011 అక్టోబర్ 1న రిలీవ్ అయి ఆర్‌కేపురం ఐటీడీఏకు వెళ్లిపోయారు. దీంతో హరిప్రసాద్ 2011 అక్టోబర్ 3న ఏటూరునాగారం ఐటీడీఏలో విధుల్లో చేరారు. హరిప్రసాద్ 2013 మే 31న ఉద్యోగ విరమణ పొందారు.

అప్పటి నుంచి ఏపీఓ జనరల్ పోస్టు ఖాళీగా ఉంది. అసలు విషయమేమిటంటే ప్రభాకర్‌రావు పనిచేసేది ఆర్‌కేపురంలో అయితే వేతనం చెల్లించేది ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయమే. ఏడాది కాలంగా నెలకు రూ.30వేల చొప్పున చెల్లిస్తూనే ఉంది. ఆర్‌కేపురం నుంచి విధుల హాజరు పట్టిక రావడంతో ఇక్కడి అధికారులు వేతనాలు చెల్లిస్తున్నారు.

 స్థానికంగా ఏపీఓ లేకపోవడంతో సంక్షేమ పథకాలు గిరిజనుల దరిచేరడంలేదని, విషయం గ్రహించిన అప్పటి ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ 2013 అక్టోబర్ 29న గిరిజన సంక్షేమ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇక్కడ పనిచేయాల్సిన ప్రభాకరావు ఆర్‌కేపురం ఐటీడీఏలో ఉన్నారని, వెంట నే ఇక్కడికి బదిలీ చేయాలని కోరారు. అనంత రం పీఓ బదిలీ కావడంతో ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆర్‌కేపురంలో పనిచేస్తున్న ఏపీఓ జనరల్ ప్రభాకర్‌రావును ఇక్కడి బదిలీ చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement