సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ప్రస్తుతానికి ఒక్క మోటార్‌తో మొదలవగా మిగతా పంపుల ప్రారంభం ప్రాణహిత, గోదావరిలో పూర్తిస్థాయి వరదలు పుంజుకున్నాకే జరగనుంది. జూలై నుంచి ప్రవాహాలు పుంజుకొనే తీరుకు అనుగుణంగా ఒక్కో మోటార్‌ను ఆన్‌చేస్తూ నీటిని తీసుకునేలా ఇప్పటికే అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఏటా జూన్ నుంచి ప్రాణహితలో ప్రవాహాలు మొదలవుతాయి. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతంలో పెద్దగా వర్షాలు కురవలేదు.
దీంతో ఈ ఏడాది 1,471 క్యూసెక్కులకు మించి ప్రాణహితలో ప్రవాహాలు లేవు. ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రాణహితలో 1,385 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా 21న 1,420 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగినట్లు టెక్రా గేజ్ స్టేషన్ రికార్డులు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి గరిష్టంగా 50 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఈ ఏడాది 2 వేల క్యూసెక్కులు కూడా దాటలేదు. ఈ నేపథ్యంలోనే గోదావరి నీటి ఎత్తిపోతల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం గోదావరి నదిపై క్రాస్ బండ్ నిర్మించి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఈ నిల్వతో వచ్చిన నీటితోనే ఒక్క మోటార్‌ను ఆన్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
ప్రస్తుతం గోదావరిలో 94 మీటర్ల నీటి ప్రవాహం కొనసాగుతుండగా 100 మీటర్ల లెవల్ నీటి ప్రవాహం ఉంటేనే రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం సాధ్యం కానుంది. అయితే ప్రస్తుతం రుతుపవనాలు పుంజుకోవడంతో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో జూలై నుంచి ప్రవాహం పుంజుకునే అవకాశం ఉంది. జూలై రెండో వారానికి 50 వేల మేర ప్రవాహాలు వచ్చినా ఒక్కో మోటార్‌ను ప్రారంభిస్తూ నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment