ఏపీతో సంబంధం లేదు
కలిసొచ్చినా, రాకున్నా తెలంగాణలో ఎంసెట్ నిర్వహిస్తాం
తెలంగాణ విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి వచ్చినా రాకున్నా తెలంగాణలో ఎంసెట్ నిర్వహించేది తమ ప్రభుత్వమేనని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ సహకరిస్తే వారికి కూడా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్ధత ఉందని, ఏపీ ఉన్నత విద్యా మండలికే లేదని స్పష్టం చేశారు. సచివాల యంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం కలిసి రాకపోతే ఇక్కడి విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల విషయంలో తెలంగాణ విద్యార్థుల్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ విద్యార్థులకు వివరించామన్నారు. ఏపీ ప్రభుత్వమే లేని అధికారాలు కోరుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులను గందరగోళంలో పడేస్తోందని ఆరోపించారు. ఏపీ సీఎం రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారమే పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అవసరం లేదనుకుంటే వారే సొంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వండి: విద్యార్థులు
హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణం జారీ చేయాలని కోరుతూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలంగాణ గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థి సంఘం సచివాలయంలో వినతిపత్రమిచ్చింది. కాగా, డీఎస్సీ-1998లో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్యే ఆర్.కష్ణయ్యతో కలిసి మంత్రిని కోరింది. మరోవైపు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనివిద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు తెలంగాణ పీఆర్‌టీయూ విజ్ఞప్తి చేసింది. పీఆర్‌టీయూ నేతలు పి.వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తదితరులు మంగళవారం సచివాలయంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శిని కలిశారు.