ఎంసెట్‌ కాదు.. ఇక ఈఏసెట్‌ | Eamcet replaceed tecet | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ కాదు.. ఇక ఈఏసెట్‌

Published Tue, Mar 14 2017 9:37 PM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

Eamcet replaceed tecet

హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పటికే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) పరిధిలోకి వెళ్లగా, ఇపుడు ఆయుర్వేద, హోమియో, నేచురోపతి, యోగా (ఆయుష్‌) కోర్సులు కూడా నీట్‌ పరిధిలోకి వెళ్లాయి.  ప్రస్తుతం ఎంసెట్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, దాని సంబంధిత కోర్సులే మిగిలాయి. ఇక వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్‌ కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల పరిధిలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 2018 -19 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు  జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చింది. అధికారికంగా అదే జరిగితే ఎంసెట్‌లో ఇక మిగిలే అగ్రికల్చర్, బీఫార్మా, ఫార్మా-డీ, బీఎస్సీ (అగ్రికల్చర్‌), బీఎస్సీ (హార్టికల్చర్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, యానిమల్‌ హస్‌బెండరీ, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌ (ఎఫ్‌ఎస్‌టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) కోర్సులే. రాష్ట్ర స్థాయిలో వాటిల్లో ప్రవేశాలకు మాత్రమే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
 
నేటి నుంచి ఆయుష్‌ మినహా దరఖాస్తులు
నీట్‌ ద్వారానే ఆయుష్‌ ప్రవేశాలు.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎంసెట్‌ కమిటీకి స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు రాత పూర్వకంగా ఎంసెట్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డికి లేఖ పంపించింది. దీంతో ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (ఎంసెట్‌) నుంచి మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షను తొలగించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 
 
ఇకపై ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌తోపాటు దాని పరిధిలోకి వచ్చే వెటర్నరీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకే ఈఏసెట్‌ నిర్వమించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న దరఖాస్తుల ప్రక్రియలో ఈ మేరకు మార్పులను చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయుర్వేద, హోమియో, నేచురోపతి, యోగా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఇక ఎంసెట్‌కు (ఇప్పటి వరకు పిలుస్తున్నది) దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. వారంతా నీట్‌ పరీక్ష కోసమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 50 వేల మందికి పైగా విద్యార్థులు నీట్‌ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఎంసెట్‌ కమిటీ ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ సెట్‌ (ఈఏసెట్‌) నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.
 
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, దాని పరిధిలోని వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన డీటేయిల్డ్‌ నోటిఫికేషన్‌ను ఈనెల 15న వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ఎంసెట్‌ కమిటీ చర్యలు చేపట్టింది. దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వరకు ఉంటుందని, విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లోకి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 16 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్లో సబ్మిట్‌ చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరించుకోవచ్చు. ఆలస్య రుసుముతో వచ్చే నెల 21 నుంచి మే 8వ తేదీ వరకు (రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు, ఆలస్య రుసుమును బట్టి గడువు) దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేవారు. విద్యార్థులు మే 5వ తేదీ నుంచి 9–5–2017 వరకు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ రాత పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, దాని పరిధిలోని వెటర్నరీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు (మెడికల్‌ స్ట్రీమ్‌ తొలగించినందున) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement