‘నీట్’ ముళ్లు!
సుప్రీం తీర్పుతో కలకలం..
* మే 13 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు
* ఆ లోగానే ఎస్సెల్పీ వేసి మినహాయింపు సాధించాలి... లేదంటే ఎంసెట్ తదుపరి షెడ్యూలుపై ప్రభావం
* మెడికల్, డెంటల్ సీట్లపై ఇబ్బందేనంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు నేపథ్యంలో ఏపీ ఎంసెట్‌కు సంబంధించి అనేక సందేహాలు నెలకొంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం యధావిధిగా ఎంసెట్‌ను నిర్వహిస్తామని మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌లు ప్రకటించడం తెలిసిందే. ఏపీకి ప్రత్యేకించి ఆర్టికల్ 371డీ కింద ప్రత్యేక రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున నీట్‌పై మరోసారి సుప్రీంకోర్టుకు విన్నవిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 371డీ అంశాన్ని గురువారమే ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినా ఆ వాదనలను తదుపరి వింటామని, నీట్‌ను అన్ని రాష్ట్రాలు అమలుచేయాల్సిందేనని కోర్టు స్పష్టంచేసింది.
దీంతో నీట్‌ను కాకుండా ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే తదుపరి దాని పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనిపై ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ, న్యాయశాఖ, న్యాయనిపుణులతో చర్చలు ప్రారంభించింది. ఉన్నతాధికారులు, న్యాయనిపుణుల చర్చల్లో వ్యక్తమైన అభిప్రాయాల ప్రకారం ఎంసెట్‌ను నిర్వహించినా ఈ అంశంపై వెంటనే రాష్ట్ర వాదనను మరోసారి సుప్రీంకోర్టుకు విన్నవించి తదుపరి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. వచ్చేనెల 13నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ప్రారంభమవుతాయి. రెండునెలల తరువాత కానీ తిరిగి తెరుచుకోదు. ఈ తేదీలోపలే స్పెషల్ లీవ్‌పిటిషన్ వేయాలి. ఎస్సెల్పీ వేయడం ఆలస్యమైతే కోర్టు ధిక్కార పిటిషన్ ఎవరైనా వేస్తే ఇబ్బంది ఎదురవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
షెడ్యూల్ సాఫీగా సాగేనా...!
ఇలా ఉండగా ఏపీ ఎంసెట్‌ను యథాతథంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఎంసెట్‌లో తదుపరి షెడ్యూల్ సాఫీగా జరిగేనా అన్నది సందిగ్ధంగా మారుతోంది. శుక్రవారం పరీక్ష నిర్వహించి అదే రోజు సాయంత్రం వెబ్‌సైట్లో ప్రాథమిక కీ విడుదల, మే 4వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. మే 9న ఫైనల్ కీతోపాటు ర్యాంకులను వెల్లడించాలని ఇంతకు ముందు నిర్ణయించారు. ప్రభుత్వం వేసే ఎస్సెల్పీని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఫలితాల వెల్లడి సహా ఇతర షెడ్యూల్‌పై ఏం చర్యలు తీసుకోవాలో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సెల్పీ విచారణకు రాకుంటే కనుక షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. ఆ తదుపరి అడ్మిషన్లలో ఇంజనీరింగ్ సీట్ల వరకు సాఫీగా ముందుకు వెళ్లగలిగినా మెడికల్, డెంటల్ సీట్లపైనే ఇబ్బంది రావచ్చంటున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ అడ్మిషన్లపై మే 27న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, జూన్ 9 నుంచి 18 వరకు వెబ్‌సైట్లో ఆప్షన్ల నమోదు, జూన్22న సీట్ల కేటాయింపు ఉంటుంది. మెడికల్ కోర్సులకు సంబంధించి ఎంబీబీఎస్‌లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 1,900 సీట్లు ఉన్నాయి. 14 ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 3,900 సీట్లు ఉన్నాయి. డెంటల్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కాలేజీలు రెండింటిలో 140 సీట్లు, 12 ప్రయివేటు కాలేజీల్లో 1,160 సీట్లు ఉన్నాయి. వీటి ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలను అనుసరించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అధికారవర్గాలు వివరించాయి.
నీట్‌తో రాష్ట్ర విద్యార్థులకు నష్టమే
నీట్ ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తాను రూపొందించిన సిలబస్‌తో నిర్వహిస్తుంది. రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్న విద్యార్థులు నీట్‌కు వేరే సిలబస్ కారణంగా నష్టపోతారని పేర్కొంటున్నారు. అందుకే ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక తదితర అనేక రాష్ట్రాలు నీట్‌ను వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. అయినా నీట్ నిర్వహణకే సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో తదుపరి చర్యలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మే 1న నీట్-1 (ఆలిండియా ప్రీమెడికల్ టెస్టు-ఏఐపీఎంటీ)ని నిర్వహించాల్సి ఉంటుంది. దీన్నుంచి గతంలో ఏపీ మినహాయింపు పొందిందని, అయినా ఇప్పుడు సుప్రీంకోర్టు దాని నిర్వహణా తప్పనిసరి అని పేర్కొనడంతో ఏం చేయాలో న్యాయసలహాల ప్రకారం నడవాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు వివరించారు.
వాస్తవానికి ఏపీకి ఆర్టికల్ 371 డీ అమలవుతున్నందున విద్యా, ఉద్యోగాల్లో అత్యధిక కోటా స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి ఆయా కాలేజీల్లో మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు, 15 శాతం స్థానికేతర కోటా కింద ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వాలి. అయితే నీట్‌తో రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లోని సీట్లన్నీ ‘నేషనల్ పూల్’లోకి వెళ్తాయి. దీనివల్ల 371 డీ ప్రకారం రాష్ట్ర విద్యార్థులు తమకు రావలసిన 85 శాతం కోటా మెడికల్ సీట్లను కోల్పోయే ప్రమాదముంటుంది.
‘నీట్’వల్ల నష్టాలివీ..
సాక్షి, హైదరాబాద్: నీట్ వల్ల జరిగే నష్టాలు ఏంటో నిపుణుల మాటల్లోనే...
- నీట్ ప్రవేశ పరీక్ష పూర్తిగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు 90 శాతం పైన స్టేట్ సిలబస్ చదువుకున్న వారే. వీరికి ఇబ్బంది వస్తుంది.
- ఎంసెట్‌లో అయితే తెలంగాణలో చాలామంది అభ్యర్థులు ఉర్దూ మీడియంలో రాసేవారు. నీట్ ప్రవేశ పరీక్షలో ఆ విధానం ఉండదు.
- ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో చాలామంది విద్యార్థులు తెలుగు భాషలో రాసేందుకు ఆప్షన్ ఇస్తారు. కానీ నీట్‌లో ఇది ఉండదు. కేవలం హిందీ, ఇంగ్లీషులో మాత్రమే ప్రవేశ పరీక్ష ఉంటుంది.
- ఓబీసీ, బీసీ విద్యార్థులకు నీట్ ప్రవేశ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు వస్తేనే అర్హత సాధించినట్టు. సీబీఎస్‌ఈ సిలబస్ కారణంగా చాలామంది అర్హత సాధించలేకపోయే ప్రమాదముంది.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులు రావాలి. అలా రాకపోతే రాష్ట్రంలో రిజర్వు కోటాలో ఉన్న సీట్లు మిగిలిపోయే ప్రమాదముంది. ఆ సీట్లను కూడా ఇత రాష్ట్రాల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయకూడదు.
- యాజమాన్య కోటా సీట్ల విషయంలోనూ నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ అవుతాయి. ఒకవేళ మన రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సాధించలేకపోతే ఇతర రాష్ట్రాల అభ్యర్థులతో సీట్లు భర్తీ చేసుకుంటారు.
-
అదే ప్రభుత్వ సీట్లుగానీ, కన్వీనర్ కోటా సీట్లకు గానీ అర్హత సాధించలేకపోతే ఆ సీట్లు మిగిలిపోవాల్సిందే తప్ప ఇతర రాష్ట్రాల అభ్యర్థులతో భర్తీ చేసుకునే వీలుండదు.