ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం : ఈసీ | EC To Kick Start Election Process In Telangana | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 14 2018 1:30 PM | Last Updated on Fri, Sep 14 2018 4:09 PM

EC To Kick Start Election Process In Telangana - Sakshi

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని, నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు.

కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తున్నామన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సీఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని రజత్‌కుమార్‌ చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి వస్తారన్నారు. ఓటరు నమోదుకు సమయం సరిపోదని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయని, అయితే గత అనుభవాల దృష్ట్యా సమయం సరిపోతుందని సీఈసీ పేర్కొందని చెప్పారు. ఈవీఎంలలో సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉన్నాయని, ఏ ఈవీఎం ఎక్కడకు వెళ్లేది చివరి నిమిషం వరకూ తెలీదని చెప్పారు. వివిప్యాట్‌ మిషన్లను కొత్తగా ప్రవేశపెడుతున్నామని, ఈనెల 18లోగా ఈవీఎంలు, వివిప్యాట్‌లు జిల్లాలకు చేరాల్సి ఉందన్నారు. ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

సీఈసీ ప్రతినిధుల భేటీలో శాంతిభద్రతలను సమీక్షించారని, బూత్‌ల వారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు అధికారులు ప్రణాళిక  ఇచ్చారన్నారు. ఓటరు జాబితా, మెటీరియల్‌, సిబ్బందిని సిద్ధం చేస్తున్నామని, ఓటరు జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందచేస్తామన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లకు బూత్‌ లెవెల్‌ అధికారులు వెళతారన్నారు.


నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా ఏడు జిల్లాలు
ఏడు జిల్లాలను నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలుగా ఈసీ గుర్తించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందన్నారు. హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి కాల్‌ డెస్క్‌కు 30 లైన్స్‌ అనుసంధానిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement