
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసేలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఇప్పటికే రూపొందించగా.. మే 17న పంచాయతీ ఓటర్ల తుది జాబితాలను వెల్లడించనుంది. ఇక ఎన్నికల నిర్వహణలో కీలకమైన బీసీ ఓటర్ల సంఖ్యను తేల్చే ప్రక్రియను మే 18 నుంచి మొదలుపెట్టాలని భావిస్తోంది. గ్రామ పంచాయతీల వారీగా బీసీ ఓటర్ల సంఖ్య తేలగానే రిజర్వేషన్లను నిర్ధారించనున్నారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. మొత్తంగా జూన్ తొలివారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని, జూలై చివరి వారంలో పోలింగ్ నిర్వహించవచ్చని సమాచారం.
ఉన్నతాధికారులతో ఈసీ సమావేశం
పోలింగ్ నిర్వహణపై పోలీసు, ఆర్థిక, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి సోమవారం సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగినందున కొత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పెరిగిన పోలింగ్ బూత్‌ల సంఖ్యకు అనుగుణంగా పోలీసు, ఇతర సిబ్బందిని సిద్ధం చేయాలని సమావేశంలో సూచించారు. పాఠశాలల సెలవులు, వసతుల విషయాన్ని తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు అంచనాలపై చర్చ జరిగింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, అడిషనల్ డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment