‘న్యాక్‌’ ఉండాల్సిందే! | Education Department Focus on NAAC | Sakshi
Sakshi News home page

‘న్యాక్‌’ ఉండాల్సిందే!

Published Wed, Jul 17 2019 1:24 PM | Last Updated on Wed, Jul 17 2019 1:24 PM

Education Department Focus on NAAC - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉన్నత విద్యకు అత్యుత్తమ ప్రమాణాలు అందించే బృహత్తర కార్యక్రమం త్వరలో సాకారం కానుంది. వృత్తివిద్యా కళాశాలల్లో ఉన్నత విద్యాప్రమాణాలు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయస్థాయి సగటు 20 శాతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదిశాతం కళాశాలలకే  నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ గుర్తింపు ఉండడంతో ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించేందుకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు రాబోయే ఐదేళ్లలో అన్ని రకాల ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్‌మెంట్‌ ఇతర ఉన్నత విద్యాసంస్థలు న్యాక్‌ లేదా నేషనల్‌బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ సాధించే దిశగా ఆయ కళాశాలలు, విద్యాసంస్థలకు అవగాహన కల్పించేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటుండడం విశేషం. కాగా గ్రేటర్‌పరిధిలో సుమారు 500కుపైగా వృత్తి విద్యాకళాశాలలుండగా..ఇందులోనూ 20 శాతం కళాశాలలకే న్యాక్‌ గుర్తింపు ఉన్నట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో అన్ని కళాశాలల్లో త్వరలో ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

వృత్తి విద్యాకళాశాలలు కేరాఫ్‌ గ్రేటర్‌సిటీ...
గ్రేటర్‌పరిధిలో ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్‌ తదితర వృత్తివిద్యా కళాశాలలతోపాటు పలు కోర్సులను అందించే వృత్తివిద్యా కళాశాలలకు సుమారు 500 వరకు ఉన్నాయి. వీటిలో న్యాక్‌ లేదా ఎన్‌బీఏ గుర్తింపున్నవి కేవలం 100కు మించిలేవంటే అతిశయోక్తి కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాప్రమాణాలు, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు,ప్రయోగపరీక్షలు, పరిశోధన వంటి అంశాలకు పెద్దపీఠ వేయకపోవడం,న్యాక్,ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ సాధించేఅంశంపై దృష్టిసారించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2024 నాటికి అన్ని వృత్తి విద్యాకళాశాలలు, విద్యాసంస్థలు న్యాక్‌ గుర్తింపు సాధించే అవకాశాలు మెరుగుపడనున్నాయి.  

జాతీయస్థాయిలోనూ ఇదే పరిస్థితి...
న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు సాధించే విషయంలో జాతీయస్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ గుర్తింపు విషయంలో జాతీయస్థాయి సగటు 20 శాతం మేర ఉంది. ఉదాహరణకు మొత్తం 42000 వేల విద్యాసంస్థలకు గాను న్యాక్‌ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు 8700, ఎన్‌బీఏ గుర్తింపు పొందిన 15 వేల కోర్సుల్లో కేవలం 3050 కోర్సులకు మాత్రమే ఎన్‌బీఏ గుర్తింపు లభించినట్లు ఉన్నతవిద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. కాగా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జాతీయస్థాయి సగటు కంటే న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు మొత్తం విద్యాసంస్థల్లో సుమారు 30 శాతం మేర ఉన్నట్లు పేర్కొన్నాయి. అంటే జాతీయ స్థాయి కంటే ఆయా రాష్ట్రాల్లో గుర్తింపున్న కళాశాలలు అధికంగా ఉన్నట్లు తెలిపాయి.

న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపుతో కలిగే ప్రయోజనాలివీ...
ఉన్నతవిద్యా ప్రమాణాలు, ప్రయోగాలు, పరిశోధనల ఆధారంగా విద్యాసంస్థల వర్గీకరణ  
విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అవసరమైన సాంకేతిక అంశాలను కళాశాలలోనే నేర్చుకునే అవకాశం.
విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, లైబ్రరీ వంటి వసతులు పెరుగుతాయి.
కళాశాలల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన బోధకులు బోధించే అవకాశం ఉంటుంది.
ఆయా కళాశాలలకు సైతం ప్రోత్సాహకాలు లభిస్తాయి. వాటి బోధన,పరిశోధన సామర్థ్యం పెరుగుతుంది.
న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు పొందిన కళాశాలల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు పెరుగుతాయి.
విద్యార్థులు జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో సత్తా చాటే అవకాశం ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో అవకాశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

అవగాహన కల్పిస్తున్నాం
జాతీయస్థాయి సగటుతో పోలిస్తే తెలంగాణారాష్ట్ర వ్యాప్తంగా న్యాక్,ఎన్‌బీఏ గుర్తింపు కలిగిన కళాశాలలు పదిశాతం మేరనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా విద్యాసంస్థలకు న్యాక్,ఎన్‌బీఏ గుర్తింపు ఎలా సాధించాలో నిపుణుల పర్యవేక్షణలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాల్లో న్యాక్‌ సంస్థ ప్రతినిధులు సైతం హాజరై ఆయా కళాశాలల యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నారు.– పాపిరెడ్డి, ఉన్నతవిద్యామండలి చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement