విద్యా వలంటీర్ల భర్తీ షురూ | Education volunteers to replace starts | Sakshi
Sakshi News home page

విద్యా వలంటీర్ల భర్తీ షురూ

Published Thu, Sep 10 2015 11:37 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

విద్యా వలంటీర్ల భర్తీ షురూ - Sakshi

విద్యా వలంటీర్ల భర్తీ షురూ

నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
- జిల్లాలో 1104 పోస్టులు
- 21 నుంచి విధుల్లోకి..
జోగిపేట:
విద్యావలంటీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. జిల్లాలో ఉపాధ్యాయులు లేని పాఠశాలను తెరిపించడంతో పాటు ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనపు టీచర్లు అవసరం ఉండడంతో వాలంటీర్ల నియామకం అనివార్యమైంది. ఈ నియామకాలను సోమవారం నుంచి ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం 1104 విద్యావలంటీర్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
 
నియామకం ఇలా...
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులు బోధించేందుకు కావాల్సిన విద్యావలంటీర్ల వివరాలను మండల రిసోర్సు సెంటర్లు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచుతారు.
- నేటి (శుక్రవారం)తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ముగుస్తుంది
- 12, 13 తేదీల్లో మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో దరఖాస్తుల స్క్రూట్నీ  
- 14న అర్హులైన వారి దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారికి ఎంఈఓలు అందిస్తారు
- 15న డీఈఓ మెరిట్ లిస్టును తయారు చేసి జిల్లా స్థాయి కమిటీకి అప్రూవల్ కోసం పంపుతారు
- 16న మెరిట్ లిస్టును డీఈఓ మండల విద్యాశాఖాధికారులకు అందిస్తారు
- 18న మండల విద్యాశాఖాధికారులు మెరిట్ లిస్టులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అందిస్తారు
- 21 నుంచి అర్హులైన అభ్యర్థులు ఒప్పందం పత్రాలతో పాఠశాలలో చేరతారు
- 22న విద్యావలంటీర్ల వివరాలను డీఈఓ డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు పంపుతారు
 
గడువు నేటితో ఆఖరు
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యావలంటీర్ల నియామకానికి దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగుస్తుందని డీఈఓ నజిమొద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 1104 వీవీల పోస్ట్‌లు మంజూరయ్యాయని, వాటి కోసం ఆన్‌లైన్‌లో శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 12, 13 తేదీల్లో దరఖాస్తు కాపీపై సంబంధిత ఎంఈఓలతో పరిశీలన చేయించుకొని సదరు కార్యాలయంలో సమర్పించాలన్నారు. 14న మండల విద్యాధికారులు అభ్యర్థుల ధృవీకృత ఆన్‌లైన్ దరఖాస్తులను సబ్జెక్ట్‌ల వారీగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.
 
పారదర్శకంగా...
జోగిపేట డివిజన్‌లో విద్యావలంటీర్ల నియామకాలు పారదర్శకంగా చేపడతాం. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. నియామకాల్లో ఎటువంటి అవతవకలు చోటు చేసుకోకుండా చూస్తాం. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.  
- పొమ్యానాయక్, ఉప విద్యాధికారి, జోగిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement