సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ములుగు జిల్లా ములుగు మండలం మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో కారు-అంబులెన్స్ ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు(ఏపీ 20ఏయూ 2198) అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎనిమిది నెలల పసికందు ఉంది. సీటు మధ్యలో ఇర్కుపోయి చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో వాజేడు వెంకటపూర్‌కు చెందిన బానోతు సోనాల్, అతని భార్య రజిత, వీరి చిన్న పాప, మరో వ్యక్తి మృతి చెందారు. వీరు కారులో వెంకటపూర్ నుండి హైదరాబాద్‌కు వెళుతున్న క్రమంలో మొదట వరంగల్ నుండి ములుగు వెళుతున్న తిరుపతి రెడ్డి కారును ఢీకొట్టి తర్వాత ఎదురుగా వస్తున్న పోలీస్ అంబులెన్స్ వ్యాన్‌ను గుద్దుకుంది. ప్రమాద సమయంలో చిన్నారితో సహా కారులో ఏడుగురు ఉన్నారు. వీరిలో పాపతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్న మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కావాల్సివుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులు జనగామ ప్రాంత వాసులుగా గుర్తించారు. పెద్దామడుర్ వాసి కృష్ణ, జనగామకు చెందిన మందిప్, సోమా నర్సయ్య ప్రాణాలు కోల్పోయారు. పెద్దమడుర్ గ్రామానికి చెందిన వారు పండుగ షాపింగ్ కోసం జనగామకు వెళ్తుండగా, మరో కారులోని వారు బర్త్ డే పార్టీ కోసం దేవురుప్పుల వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment