ముకరంపుర : రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముస్లిం మతపెద్దలు, ప్రతినిధులు, అధికారులతో రంజాన్ మాసంలో చేయూల్సిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈద్గా, మసీదులకు మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించాలని సూచించారు. వర్షాకాలంలో రంజాన్ మాసం వస్తున్నందున ఆహారం కల్తీ కాకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు, పండ్ల ధరల నియంత్రణకు తనిఖీలు చేయాలన్నారు.
అన్ని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో నీటి సరఫరా సరిగా చేయాలని, ఇబ్బందులుంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఏ రోజు చెత్త అదే రోజు తొలగించాలని, వీధిదీపాలు అమర్చాలని సూచించారు. రంజాన్ మాసంలో ముస్లింలు కోరిన వెంటనే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు 5కిలోల చక్కెర పంపిణీ చేయాలని కోరగా.. వెంటనే ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. మసీదులకు వెళ్లే డ్రైనేజీలు మరమ్మతులుంటే వెంటనే చేయాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు.
కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ ఏర్పాటు
రంజాన్ మాసంలో ఏమైనా సమస్యలుంటే తెలుపుటకు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్ 18004254731 ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇది కార్యాలయం పనివేళల్లో పని చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 9490163835 నెంబర్‌కు ఫోన్ చేస్తే.. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి 8331017552 నెంబర్‌కు ఫోన్ చేస్తే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సమస్యను పరిష్కరిస్తారని, ఇతర ప్రాంతాలలో సంబంధిత డీఈలను సంప్రదించాలని సూచించారు.
ట్రాఫిక్ టీంల ఏర్పాటు : ఎస్పీ
ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రత సమస్యలు లేకుండా గత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ టీంలను ఏర్పాటు చేసి నమాజ్‌కు వెళ్తున్న వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సమస్యలుంటే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మకూడదని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌వో టి.వీరబ్రహ్మయ్య, జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఎస్‌వో చంద్రప్రకాశ్, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ రమణాచారీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాస్, డీపీవో కుమారస్వామి, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ హమీద్, సంబంధిత అధికారులు, ముస్లిం నాయకులు మహ్మద్ ఆరిఫ్, ఎస్‌ఏ.మోసిన్, అబ్బాస్‌షమీ, మహ్మద్ షకీర్, సయ్యద్ అక్బర్ హుస్సేన్, మహ్మద్ తాజ్, సయ్యద్ బర్కత్ అలీ, ఖమ్రెద్దీన్, సిరాజ్ హుస్సేన్, సాజిత్ అలీ, బాబుజానీ, సలీం, షాహెద్ నిహాల్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్‌కు విస్తృత ఏర్పాట్లు
Published Sat, Jun 13 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement