నగలకు మెరుగు పెడతామంటూ మోసం
నగలకు మెరుగు పెడతామంటూ మోసం
Published Fri, Mar 24 2017 9:05 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
కోదాడ: బంగారు నగలకు మెరుగు పెడతామంటూ మహిళను ఏమార్చి నాలుగు తులాల బంగారు గొలుసుతో ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. ఈ సంఘటన గురువారం మండల పరిధిలోని గుడిబండలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంకా వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి తోడుగా వారి మూడో కోడలైన భవానీ ఉంటుంది. గురువారం ఉదయం పది గంటల సమయంలో రాగి పాత్రలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఓరాగి పాత్రకు, మరో వెండి వస్తువుకు మెరుగు పెట్టి చూపిం చారు.
తర్వాత బంగారు వస్తువులకు కూడా మెరుగుపెడతామంటూ చెప్పి మంగమ్మ మెడలో ఉన్న పుస్తెల తాడును ఇవ్వమని అడిగారు. మంగమ్మతో పాటు ఆమె కోడలు భవానీ ఎంత వద్దన్నా వారు వినిపించుకోకుండా మా చేతికి ఇవ్వవద్దు, మీరే మెరుగుపెట్టుకోండి అంటూ వారిని నమ్మించారు. పాత్రలో వస్తువులు వేసి వేడి చేయాలని చెప్పి మహిళలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో పాత్రలోని వస్తువులను మాయం చేసి ఒకరి తరువాత ఒకరు జారుకున్నారు. కొద్ది సమయం తర్వాత బాధితులు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం వెతికినా ఫలితం లేకపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement