నల్లగొండ : ఈవీఎంలపై అవగాహనను పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, నల్లగొండ : సాధారణ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా డబుల్ ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఇందుకు మొదటి సారిగా ఉపయోగిస్తున్న ఈఆర్‌ఓ నెట్ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా రెండు ఓట్లు, ఆపై ఎక్కువ ఉన్నవారిని గుర్తించి తొలగింపునకు చర్యలు చేపట్టారు. ఒకటే ఓటు ఉండాలని.. రెండు ఓట్లు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో యువత ఓటుహక్కు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంది. మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు, వాటిపై సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం పూర్తయింది.
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు నేరుగా, ఆన్‌లైన్ ద్వారా లక్షా 4వేల 195 దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్తగా ఓటు నమోదుకు 60,626 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే యువత ఓటు నమోదుపై పెద్దఎత్తున శ్రద్ధ కనబరిచింది. ఇందుకు అధికారులు తీసుకున్న కార్యక్రమాలు ఫలించినట్లు స్పష్టమవుతోంది. జిల్లాకు ఇప్పటికే 2,600 బ్యాలెట్ బాక్సులు, 2,030 ఈవీఎంలు, 2,200 వీవీ ప్యాట్లు బెంగళూరు నుంచి తెప్పించి కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాముల్లో భద్రపరిచారు. రాజకీయ పక్షాల సమక్షంలో వాటి పనితీరుపై ఇప్పటికే కలెక్టరేట్‌లో అవగాహన కల్పించారు.
డబల్ ఓట్లపై దిద్దుబాటు చర్యలు..
ఈఆర్‌ఓ నెట్ ద్వారా డబుల్ ఓట్ల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. రెండు ఓట్లు ఉన్న వారికి ఎక్కడ ఓటు కావాలని అడుగుతున్నారు. ఒక ఓటు తొలగించుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతోపాటు ఓటరు మోదు దరఖాస్తులు, అడ్రసు, పేరుమార్పుతోపాటు, ఒక పోలింగ్‌బూత్ నుంచి మరో పోలింగ్ బూత్‌కు ఓటు మార్చుకునేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అక్టోబర్ 8న తుది ఎన్నికల జాబితా విడుదల చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ ముగిసిన నాటినుంచి ఆర్డీఓలు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. బీఎల్‌ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది ఈ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నారు.
నియోజకవర్గానికి పది అవగాహన టీమ్‌లు
ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గానికి పది టీ మ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1628 పోలింగ్‌కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు వీరు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శనివారం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. నల్లగొం డ తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దానిని అక్కడే ఉంచుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. అవగాహనకు వాడే యంత్రాలను ఎన్నికల్లో వాడబోమని, ఇవి టెస్టింగ్ యంత్రాలని తెలిపారు.
కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్..
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని నివృత్తి చేసుకోవడంతోపాటు పరిష్కారానికి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని కలెక్టర్ ఇప్పటికే ప్రారంభించారు. 18004251442 ఫోన్‌నంబర్ కేటాయించారు. ఏదైనా సమస్య ఉంటే ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment