మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అతిక్రమణల గుర్తింపు తదితరమైనవి పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇందుకుగాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీమ్‌లకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలు కలిగిన అధికారులు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం రిటర్నింగ్ అధికారులు, పోలీసు, ఎక్సైజ్, ఇన్‌కమ్ ట్యాక్స్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి నగర పోలీస్ అడిషనల్ కమిషనర్ చౌహాన్, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి, ఆదాయపన్ను శాఖ అడిషనల్ కమిషనర్ సతీష్ కుమార్, కంటోన్మెంట్ సీఈఓ చంద్రశేఖర్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, జయరాజ్ కెనెడి, జిల్లాలోని 15 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ ఫ్లైయింగ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను తక్షణమే ఏర్పాటుచేసి వాటికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలన్నారు. వివిధ పార్టీలు, పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను రికార్డింగ్ చేయాలని సూచించారు. ఎక్కడైతే అక్రమ డబ్బు చెలామణి, మద్యం సరఫరా వంటివి ఉన్నాయో గుర్తించి అక్కడకు ఈ టీమ్‌లను పంపించి వీడియో చిత్రీకరించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)అమలు అధికారిగా హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవిని నియమించినట్లు తెలిపారు. రాజధాని నగరంపై అన్ని రాజకీయ పార్టీలు, మీడియా తదితరులు ప్రత్యేక దృష్టి సారిస్తారంటూ, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. ప్రవర్తన నియమావళికి సంబంధించిన 12 నివేదికలను ప్రతిరోజూ జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో స్వీయ నిర్ణయాలకు తావులేదని, ప్రతి అంశం లిఖిత పూర్వకంగా ఉన్న ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించుకునే పార్టీలు, అభ్యర్థులు, నాయకులు సంబంధిత రిటర్నింగ్ అధికారికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ వాటిని సంబంధిత పోలీసు అధికారులకు పంపించి శాంతి భద్రతల కోణంలో పరిశీలించాక, అనుమతులు జారీ చేయాలన్నారు. రాజకీయపార్టీలు 48 గంటల ముందుగా సమావేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తనిఖీలు చేయనున్న ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు..
సభలు, ర్యాలీలకు అనుమతి పొందిందీ లేనిదీ ఫ్లైయింగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు చేస్తాయన్నారు. నియమావళి అమలులో భాగంగా వివిధ పార్టీలు, అభ్యర్థులకు చెందిన ప్రచార సామగ్రి, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక 24 గంటలు, 48 గంటలు, 72 గంటల్లో ఏంచేయాలో ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొందన్నారు. ఆ మేరకు మంగళవారం వరకు హోర్డింగులు, ఫ్లెక్సీలు తదిరమైన వాటి తొలగింపు పూర్తవుతుంది. తొలగించిన వాటి స్థానే తిరిగి ఎవరైనా ఏర్పాటు చేస్తే సంబంధిత చట్టం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గాల వారీగా నోడల్ టీమ్‌లు ఏర్పాటు చేశామని, వాటిల్లో ఆర్‌ఓతోపాటు తహసీల్దార్, డిప్యూటీ కమిషనర్, ఏసీపీ, ఎక్సైజ్ నుంచి ఒకరు ఉంటారని తెలిపారు. ప్రైవేట్ భవనాలపై పార్టీల ప్రకటనలను ఏర్పాటు చేస్తే భవన యజమానుల అనుమతి తప్పనిసరిగా పొందాలని పేర్కొన్నారు. అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులకు రూ.28 లక్షలు గరిష్టంగా వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం నిర్ధారించిందని తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ఎన్నికల ప్రచార సంబంధిత సమావేశాలను వీడియో తీయించాలని సూచించారు. సిటీ పోలీస్ అడిషనల్ కమిషనర్ చౌహాన్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, డబ్బు చెలామణిని నివారించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తమ సంబంధిత కమిటీలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
రిటర్నింగ్ అధికారులు..
హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలకు దిగువ పేర్కొన్న వారిని రిటర్నింగ్
అధికారులుగా నియమిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని దానకిషోర్ తెలిపారు.
ముషీరాబాద్ : వి.వెంకట్‌రెడ్డి(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ)
మలక్‌పేట : పి.అశోక్‌కుమార్(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కలెక్టరేట్)
అంబర్‌పేట : సందీప్‌కుమార్‌ఝా(అడిషనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
ఖైరతాబాద్ : మహమ్మద్ ముషారఫ్‌అలీ(జోనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
జూబ్లీహిల్స్ : బి.రాజాగౌడ్(ఆర్‌డీఓ, సికింద్రాబాద్)
సనత్‌నగర్ : కె.గంగాధర్(ఎస్టేట్ ఆఫీసర్, హెచ్‌ఎండీఏ)
నాంపల్లి : వి.అనురాధ(స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఎస్టేట్ ఆఫీసర్)
కార్వాన్ : శ్రీవత్స కోట(స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, హైదరాబాద్)
గోషామహల్ : వి.కృష్ణ(అడిషనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
చార్మినార్ : ఎన్.రవికిరణ్(జోనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
చాంద్రాయణగుట్ట : డి.శ్రీనివాస్‌రెడ్డి(ఆర్‌డీఓ, హైదరాబాద్)
యాకుత్‌పురా : శృతిఓజా(అడిషనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
బహదూర్‌పురా : జి.వెంకటేశ్వర్లు(స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎల్‌పీ, హైదరాబాద్)
సికింద్రాబాద్ : సీఎన్.రఘుప్రసాద్(జోనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
కంటోన్మెంట్ : ఎస్‌వీఆర్ చంద్రశేఖర్(సీఈఓ, కంటోన్మెంట్ బోర్డు)
Comments
Please login to add a commentAdd a comment