సాక్షి, వరంగల్ రూరల్: ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. నామినేషన్ల పర్వం నేటితో ముగయనుంది. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాల్లో తమ ప్రయత్నాలు ప్రారంభించారు. డబ్బులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనుమానిత బ్యాంకు లావాదేవీలపై దృష్టిపెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలిచ్చారు. ఒకేసారి ఖాతాల్లో నగదు జమకావడం గతంలో తక్కువ లావాదేవీలు జరిగిన ఖాతాల్లో ఈ మధ్య ఎక్కువగా నిర్వహిస్తే వెంటనే నిఘా పెంచాలని ఆదేశాలు జారీఅయ్యాయి.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో జీరో ఖాతాల విషయంలో కూడా లోతుగా పరిశీలన చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో ఇప్పటి వరకు రూరల్ జిల్లాలో రూ. 5.74 లక్షల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు ఆధారాలు చూపించి డబ్బులను తీసుకెళ్లారు. జనగామ జిల్లాలో తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు 24లక్షల 60వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 10 చెక్‌పోస్టుల వద్ద 49 లక్షల రూపాయలు పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. 10 లక్షల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు ఆధారాలు చూపించిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేశారు.
అభ్యర్థుల లావాదేవీలపై
ఒక్కో అభ్యర్థి ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.28 లక్షలు మాత్రమే ఖర్చుచేయాలి. రోజువారి ఖర్చుల వివరాలను సైతం ఎన్నికల అధికారులకు చెప్పాలి. ఒకసారి నామినేషన్ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత జరిగే ప్రతి లావాదేవీలు ఎన్నికల వ్యయంగా పరిగణిస్తారు. కొంత మంది అభ్యర్థులు తమ పేర్ల మీద కాకుండా బినామీల పేర్లతో ఎక్కువగా లావాదేవీలు చేస్తుంటారు. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులు డబ్బులను సమకుర్చుకుంటున్నారు.
పరిమితి దాటితే పరిశీలన
ఎన్నికల సమయంలో బ్యాంకుల్లోని ఖాతాలపై ఆదాయపు పన్ను, పోలీస్‌శాఖ నిఘా పెట్టింది. ముఖ్యంగా జీరో అకౌంట్లపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. సాధారణంగా రూ 49,999 లావాదేవీలపై ఆంక్షలు ఉండవు. రూ.50 వేలు దాటితే పాన్‌కార్డు నెంబర్‌ను తప్పనిసరిగా బ్యాంక్ అధికారులకు అందించాలి. ఎన్నికల నేపథ్యంలో కన్నేసిన నిఘా అధికారులు ఏమాత్రం అనుమానం కలిగినా సంబంధిత ఖాతాలు ఆరా తీస్తున్నారు. లక్ష రూపాయలకు మించి లావాదేవీలు జరిగిన ఖాతాలపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా డబ్బులు చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన అధికారులు వాటిపైన సైతం దృష్టి సారించారు. బలహీన వర్గాలైన మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్‌దారుల ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. పరిమితికి మించి లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలను బ్యాంక్ అధికారులు వెంటవెంటనే ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment