292మంది పోటీకి అనర్హులు | Election Commission Declared 292 Men are Disqualified In Nalgonda | Sakshi
Sakshi News home page

292మంది పోటీకి అనర్హులు

Published Thu, Apr 18 2019 11:46 AM | Last Updated on Thu, Apr 18 2019 11:46 AM

Election Commission Declared 292 Men are Disqualified In Nalgonda - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల వ్యయాన్ని చూపించని వారిపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. వారు మూడేళ్లపాటు ఎన్నికలకు అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా జిల్లాలో 292 మందిని అనర్హులుగా పేర్కొంది. జిల్లాలో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఎన్ని నిధులు ఖర్చు చేశారనేది ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఖర్చును అధికారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో సీరియస్‌ అయిన ఎన్నికల సంఘం వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించింది. 

88 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు అనర్హులు
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేసిన వారిలో 292 మంది ఓటమిపాలయ్యారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ప్రచారంలో వారు చేసిన ఖర్చులు చూపించాలని ఎన్నికల అధికారులు పలుమార్లు సూచించినా అభ్యర్థులు పెడచెవిన పెట్టారు.  వీరిలో 88మంది జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014 ఎన్నికల్లో వీరంతా జెడ్పీటీసీలుగా ఆయా మండలాల్లో పోటీ చేశారు. వారు నిబంధనల ప్రకారం ఎన్నికల్లో వారు పెట్టిన ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారులకు తెలియపర్చాలి. కానీ ఓడిపోవడంతో వారు వాటిపై దృష్టి సారించలేదు. దీంతో ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకొని మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదంటూ అనర్హులుగా ప్రకటించింది. ఈ విషయాన్ని జనవరి మాసంలో సర్పంచ్‌ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 

అనర్హత పొందిన వారు...
జెడ్పీటీసీగా పోటీ చేసి లెక్కలు చూపనందుకు అనుముల మండలంలో 9 మంది, చందంపేటలో ఇద్దరు, చండూరులో 9, చింతపల్లి 6, చిట్యాల ఒకరు, దామరచర్ల, దేవరకొండలో 6 చొప్పున, గుండ్రపల్లిలో నలుగురు, గుర్రంపోడులో ఐదుగురు, కనగల్‌ 6, కట్టంగూర్‌ 5, కేతెపల్లి 5, మిర్యాలగూడ 7, మునుగోడు, నకిరేకల్‌లో ముగ్గురు చొప్పున, వేములపల్లి, నల్లగొండ, నార్కట్‌పల్లిలో ఒక్కొక్కరూ, పీఏపల్లి, పెద్దవూరలో 4గురు చొప్పున మొత్తం 88 మంది  ఉన్నారు. వీరంతా అనర్హత వేటుకు గురయ్యారు. 

204 మంది ఎంపీటీసీ పోటీదారులు
 ఎంపీటీసీలుగా పోటీ చేసి ఖర్చుల వివరాలను ఇవ్వకపోవడంతో 204 మందిని అనర్హులుగా ఈసంవత్సరం జనవరిలోనే ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో అనుముల మండలంలో ఒకరిపై అనర్హత వేటుకు గురికాగా, చండూరులో 33 మంది, దామరచర్లలో ఒకరు, గుర్రంపోడులో 30, కట్టంగూర్‌ 38, మునుగోడులో 21, నకిరేకల్‌లో 26, నిడమనూరులో 4గురు, పెద్దవూరలో 34మంది, వేములపల్లిలో 13 మంది ఉన్నారు.

గత సర్పంచ్‌ ఎన్నికల్లో కోర్టు అనుమతితో కొందరు పోటీ....
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీరు పోటీకి అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. వారు సర్పంచులుగా పోటీ చేసేందుకు అనర్హులని ఎన్నికల అధికారులు పేర్కొనడంతో జిల్లాలో చాలామంది కోర్టును ఆశ్రయించారు. తాము ఎన్నికల్లో ఓటమి పాలవడం వల్ల ఎన్నికల ఖర్చుల వివరాలు అప్పగించాలనేది తెలియలేదని, దీంతో అప్పగించలేకపోయామని, వేరే ఉద్దేశం లేదని విన్నవించారు.  దీంతో కోర్టు అనుమతితో దాదాపు 15 మంది వరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన చేపూరి యాదయ్య కోర్టు నుంచి అనుమతి పొంది సర్పంచ్‌గా పోటీ చేశాడు. చాలామంది కోర్టును ఆశ్రయించకపోవడంతో వారు పోటీ చేయలేకపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement