మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న పోడేటి రామస్వామి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాజకీయ భవిష్యత్తుకు సోపానంగా భావించే జిల్లా పరిషత్ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్‌వల విసురుతోంది. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేల ఆదరణకు నోచుకోక, టికెట్టుకు దూరమవుతున్న మండల నాయకులను పార్టీలోకి ఆహ్వానించి, భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయిన నేతలు జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం టీఆర్‌ఎస్ అసంతృప్తి వాదులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. ‘గెలిచిన తరువాత పార్టీ మారబోను’ అనే అఫిడవిట్ సమర్పించిన బలమైన టీఆర్‌ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకొని టికెట్టు ఇవ్వాలని ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేల టికెట్టు కోసం పోటీపడి, సిట్టింగ్‌లకు సీట్లివ్వడంతో మిన్నకుండిపోయిన బలమైన టీఆర్‌ఎస్ నాయకులకు ఈసారి జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు ఇచ్చేందుకు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనాసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జెడ్‌పీటీసీ, ఎంపీపీగా మండలంలో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న నాయకులకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. పార్టీ ఇప్పటికే జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి బీఫారాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పంపిం చింది. స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జిలు, సీనియర్ నేతలతో సంప్రదించిన తరువాత ఏకాభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షులు బీఫారాలను అభ్యర్థులకు అందజేయాల్సి ఉంటుంది. తొలి విడత ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించి బుధవారంలోగా బీఫారాలు ఇచ్చే అవకాశం ఉంది.
వలసలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దృష్టి
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాలలో జెడ్‌పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేలా గత కొద్దిరోజులుగా పావులు కదుపుతున్నారు. కరీంనగర్, సిరిసిల్ల జెడ్‌పీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెబుతున్న ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట మునిసిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామిని టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేర్పించిన పొన్నం.. రామస్వామి సతీమణికి ఇల్లందకుంట జెడ్‌పీటీసీ టికెట్టు ఇవ్వనున్నారు. హుజూరాబాద్‌లో టికెట్టు వచ్చే అవకాశం లేని వారితో మాట్లాడి ఆయన కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో సైతం పొన్నం ఇదే రీతిన టీఆర్‌ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. సిరిసిల్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావును కాదని పార్టీ మారే ధైర్యం నాయకులకు లేదు. టికెట్టు వచ్చినా, రాకపోయినా టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతామని వారు చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకపోవడం కూడా వలసలు పోయేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. జగిత్యాలలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారని భావిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మంగళవారం అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు. ధర్మపురిలో టీఆర్‌ఎస్ టికెట్టు కోసం పోటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ, పార్టీ మారేందుకు నాయకులు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
పెద్దపల్లిలో మారనున్న సమీకరణలు
పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దాదాపుగా అన్ని మండలాలకు జెడ్‌పీటీసీ అభ్యర్థులను ఖరారు చేశారు. సుల్తానాబాద్, పెద్దపల్లి, శ్రీరాంపూర్, జూలపల్లి, ఓదెల మండలాల్లో ఒక్కో చోట ముగ్గురేసి అభ్యర్థులు పోటీ పడుతుండగా, వారితో విడివిడిగా సమావేశమై టికెట్టు కేటాయింపుపై స్పష్టత ఇచ్చారు. జెడ్‌పీటీసీ పోటీలో ముందున్న ఆశావహులకు ఎంపీపీ హామీలతో బుజ్జగిస్తున్నారు. కాగా కొందరు సిట్టింగ్ జెడ్‌పీటీసీ, ఎంపీపీలకు ఆయన మొండి చేయి చూపనున్నారని స్పష్టమైంది. టికెట్టు రాని వారి గురించి మాజీ ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణారావుకు సమాచారం అందడంతో ఆయన బలమైన అభ్యర్థులుగా భావిస్తున్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు తిరుగుబాట్లు తప్పకపోవచ్చు. సుల్తానాబాద్‌లో జెడ్‌పీటీసీ టికెట్టు విషయంలో వివాదం తలెత్తింది. ఈ నియోజకవర్గంలోనే ఓ సిట్టింగ్ ఎంపీపీ, సీనియర్ నాయకుడికి జెడ్‌పీటీసీ టికెట్టు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు టీఆర్‌ఎస్ జెడ్‌పీటీసీ, ఎంపీపీ ఆశావహులపై వల విసురుతున్నారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు జెడ్‌పీ చైర్మన్ అభ్యర్థిగా నిలవడంతో టీఆర్‌ఎస్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. రామగుండంలో కాంగ్రెస్ నేత రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అసంతృప్తి మండల నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్పించే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment