సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ పోరు రసవత్తరంగా సాగుతోంది. స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలు కీలకంగా మారడంతో గ్రామాల్లో ప్రలోభాలు కూడా భారీగా ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రూ. 2 వేల వరకు నేతలు పంచుతున్నారు. రాష్ట్రంలో 838 జెడ్పీటీసీ స్థానాలకు, 5,817 ఎంపీటీసీ స్థానాలకుగాను ఇప్పటివరకు మూడు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే వాటన్నింటినీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. అలాగే 132 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే అందులో 129 స్థానాలను టీఆర్‌ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మొత్తం మూడు దశల్లో పరిషత్ ఎన్నికలు జరగనుండగా తొలిదశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నెల 10న రెండో దశ, 14న మూడోదశ ఎన్నికలు ఉన్నాయి.
టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలే అంతా...
జిల్లాలు, మండలాల పునర్విభజన అనంతరం తొలిసారి పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32 జెడ్పీలు, 838 ఎంపీపీలు ఉన్నాయి. అన్నింట్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పోటీ జరుగుతున్న ప్రతి స్థానంలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచేలా ప్రయత్నించాలని అధిష్టానం పార్టీ ఎమ్మెల్యే లను ఆదేశించింది. టీఆర్‌ఎస్‌లో పరిషత్ ఎన్నికల గెలుపు బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యే లకు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు అప్పగిం చారు. జెడ్పీ, ఎంపీపీల కైవసం లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. అభ్యర్థుల ఎంపికలో కొన్నిచోట్ల అసంతృప్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారాయి. సీనియర్లకు, విధేయులకు అవకాశం ఇవ్వడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అన్ని స్థానాల్లో గెలుపు లక్ష్యంగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
‘గులాబీ’ని నిలువరించాలని...
అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో డీలా పడిన కాంగ్రెస్... గ్రామ స్థాయిలో పార్టీ పునాదులను పటిష్ట పరుచుకోవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. పరిషత్ ఎన్నికలతో ఈ పని పూర్తి చేయాలని భావిస్తోంది. టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా ఏ స్థానంలోనూ విజయం సాధించకుండా వ్యవహరించాలని అన్ని అసెంబ్లీ స్థానాల కాంగ్రెస్ ఇన్‌చార్జీలకు పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యూహం కొంతవరకు ఫలించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు తగ్గాయని స్థానికంగా కాంగ్రెస్ భావిస్తోంది. 20కిపైగా జెడ్పీలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని జెడ్పీ స్థానాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే వ్యూహంతో అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జీలు పని చేస్తున్నారు.
భవిష్యత్‌పై బీజేపీ గంపెడాశలు...
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత డీలా పడిన బీజేపీకి లోక్‌సభ ఎన్నికలతో కొంత ఊపు వచ్చింది. ఐదారు లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌తో హోరాహోరీ తలపడినట్లు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదే ఊపుతో పరిషత్ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కమలదళం పోటీ చేస్తోంది. ప్రతి జెడ్పీలోనూ, ప్రతి ఎంపీపీలనూ ప్రాతినిధ్యం లక్ష్యంగా బీజేపీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలుపు ఉమ్మడి జిల్లాలవారీగా ఇన్‌చార్జీలను నియమించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా ఉండాలని భావిస్తున్న బీజేపీ... గ్రామాల్లో కీలకమైన ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది.
మొదటిసారి బరిలో టీజేఎస్...
కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి... పరిషత్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో బలం పెంచే కీలకమైన ఎన్నికల్లో టీజేఎస్ మొదటిసారి పరీక్షను ఎదుర్కొంటోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తోంది. టీజేఎస్ అధినేత ఎం. కోదండరాం స్వయంగా పరిషత్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో నమోదయ్యే ఓటింగ్ శాతంపై టీజేఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వామపక్షాలు వేర్వేరుగా...
అసెంబ్లీలో విడిగా పోటీ చేసి ప్రతికూల ఫలితాలను రుచి చూసిన సీపీఎం, సీపీఐ పార్టీలు... లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం మళ్లీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో బలం చాటేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వాపక్ష పార్టీలు పోటీ చేయని కొన్ని స్థానాల్లో స్థానిక నాయకత్వం నిర్ణయం మేరకు ఇతర ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి.
పరిమిత స్థానాల్లో టీడీపీ పోటీ...
లోక్‌సభ ఎన్నికల పోటీ విషయంలో చేతులెత్తేసిన టీడీపీ... పరిషత్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తోంది. స్థానికంగా నాయకులు ఉన్న కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం పరిషత్ ఎన్నికలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు.
పరిషత్... ప్రతిష్టాత్మకం
Published Mon, May 6 2019 1:13 AM | Last Updated on Mon, May 6 2019 4:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment