సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పరీక్ష తెచ్చిపెట్టాయి. ఆయా నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే.. ఎమ్మెల్యేలకు రాజకీయంగా, పార్టీలో పట్టు ఉంటుంది. దీంతో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ బీఫారం దక్కితే గెలుపు ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఉంది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం అధికార పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఆశావహుల్లో పోటీని అధిగమించి గెలిచే వారికి అవకాశాలు ఎలా ఇవ్వాలా అని ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు.
ఏకాభిప్రాయం అనే విధానాన్ని అనుసరించాలని కొందరు నిర్ణయించారు. అయితే అన్ని పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లోకి చేరడంతో గ్రామాల్లో రెండు మూడు గ్రూపులుగా ఉన్నాయి. అన్ని స్థాయిలలో గ్రూపులు ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కావట్లేదు. దీంతో అభ్యర్థుల ఎంపిక కోసం చివరికి సర్వే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పలు సంస్థలతో సర్వే నిర్వహించి.. టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతో సర్వేలు మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల్లోనూ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సర్వేలతోనే అభ్యర్థులను ప్రకటించారు.
పలు సంస్థలతో..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అమలు చేస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టికెట్ల కోసం పోటీలో ఉన్న వారి జాబితా రూపొందించి వారిలో మెరుగైన అభ్యర్థి ఎవరనేది ప్రజల నుంచి తెలుసుకునేలా ఈ సర్వేలు సాగుతున్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇబ్బంది లేకున్నా.. ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు మాత్రం ఎమ్మెల్యేలకు తలనొప్పులు తెస్తోంది. మరోవైపు గ్రామాల్లోని స్థానిక పరిస్థితులను అంచనా వేయడం క్లిష్టంగా మారుతోంది. సర్వే నివేదికల ఆధారంగా మండలాల వారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఎంపీటీసీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల ముఖ్యులతో చర్చించి సర్వే వివరాలను చెబుతున్నారు. సర్వేలో పలానా వారి పేరు ముందుందని, వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఆశావహులకు సర్వే వివరాల కాపీలను అందజేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని అనునయిస్తున్నారు. మరోసారి సర్వే చేయాలని ఎమ్మెల్యేలను కొందరు కోరుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. బీ ఫారాలు ఇచ్చే వరకు సర్వేలు నిర్వహిస్తామని, అప్పటి వరకు ఎవరు మెరుగ్గా ఉంటే వారికే అవకాశం వస్తుందని చెబుతున్నారు. సర్వే వివరాలను పరిశీలించిన ఆశావహులు అందులోని అంశాలను చూసి ఎమ్మెల్యేల నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. గ్రామ ప్రజల్లో తమ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు.
మీ ఎంపీటీసీగా ఎవరుండాలి?
Published Thu, Apr 18 2019 2:46 AM | Last Updated on Thu, Apr 18 2019 2:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment