టీఆర్‌ఎస్ పార్టీలో జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిపై సందిగ్ధత వీడింది. మొన్నటి వరకు జెడ్పీ పీఠం కోసం పోటీపడిన ముగ్గురు నేతల కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైర్మన్ గిరిపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసింది. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది. జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీరాజ్ కొత్త చట్టం సంస్కరణల నేపథ్యంలో చైర్‌పర్సన్ కీలకంగా మారనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ పదవికి తీవ్ర పోటీ ఏర్పడింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ముగ్గురు నేతలు తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కోరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూతురు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోడలు పదవిని ఆశించారు. తన కూతురు పోటీ విషయంలో ప్రకాశ్‌గౌడ్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. దీంతో తమకు వద్దని అధిష్టానానికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోడలు మంచాల నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. తొలిదశ ఎన్నికల జాబితాలో ఉన్న ఆ మండలంలో అప్పటికే నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అవకాశం చేజారింది. దీంతో అనితారెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. అంతేగాక అనితారెడ్డి మామ కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
అంతకుముందు అనితారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆర్‌కేపురం డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో తమకు ఎలాగైనా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. ఫలితంగా చైర్‌పర్సన్ పదవి కోపం అనితారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు మహేశ్వరం స్థానికుల్లో ఒకరికి లేదంటే.. మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వారికే జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని కోరారు. దీనికితోడు టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైన స్థానిక ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి కూడా తమ వర్గానికి జెడ్పీటీసీ టికెట్ కావాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో అనితారెడ్డి గెలుపుకోసం స్థానిక నాయకులు, సబితమ్మ వర్గం ఏ స్థాయిలో కృషిచేస్తారన్నది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ నుంచి రేసులో ఇద్దరు..
జెడ్పీ చైరపర్సన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి సతీమణి నిత్యారెడ్డి ఒకరుకాగా.. తుక్కుగూడ మాజీ సర్పంచ్ కొమిరెడ్డి నర్సింహారెడ్డి కోడలు శాలినీరెడ్డి మరొకరు. మంచాలలో నిత్యారెడ్డి పోటీచేస్తుండగా.. శాలినీరెడ్డి మహేశ్వరం నుంచి బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతానికి వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే అభ్యర్థి పేరును ప్రకటిస్తే గ్రూపు రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నేతలు, కార్యకర్తల వలసలతో కుదేలవుతున్న జిల్లా పార్టీ.. గ్రూపు తగాదాలైతే ఇతర పార్టీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో జెడ్పీటీసీ స్థానాలు దక్కితే.. ఆ తర్వాత చైర్‌పర్సన్ అభ్యర్థి పేరును ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో అనిశ్చితి..
మరోపక్క బీజేపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఆ పార్టీలో చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నవారు పెద్దగా లేనట్లు తెలుస్తోంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపుపై ప్రధానంగా దృష్టిసారించింది. తొలి, రెండు దశల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో ఆ స్థాయి అభ్యర్థులు లేరని పార్టీలో చర్చజరుగుతోంది. ఇక ఆశలన్నీ మూడో దశ ఎన్నికలు జరుగుతున్న మండలాలపైనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment