![Election Commission reported to High Court on ZPTC, MPTC elections - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/25/HIGH-COURT-10.jpg.webp?itok=hAqH5Dav)
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు.
ఇప్పటికే ఇదే అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు కలిపి విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులిచ్చారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పథకాన్ని అడ్డుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణ అవసరమో లేదో ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడి చెబుతామన్నారు. ఇందుకు అంగీకరిం చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment