ప్రతిష్టాత్మకం..పరిషత్‌ ఎన్నికలు | Zilla And Mandal Parishad Elections Challenges For Political Parties | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకం..పరిషత్‌ ఎన్నికలు

Published Tue, Apr 30 2019 9:01 AM | Last Updated on Tue, Apr 30 2019 9:01 AM

Zilla And Mandal Parishad Elections Challenges For Political Parties - Sakshi

బెల్లంపల్లి : పరిషత్‌ ఎన్నికలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ , గ్రామ పంచాయతీ  ఎన్నికల్లో మాదిరిగానే ఈఎన్నికల్లోనూ సత్తాచాటాలని టీఆర్‌ఎస్‌ తహతహలాడుతుండగా కనీసం పరిషత్‌ ఎన్నికల్లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనే కాంక్షతో కాంగ్రెస్‌ ముందుకు సాగుతోంది. ఆ రెండు పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే సమర్థులైన అభ్యర్థులను పోటీలోదింపి ప్రచార పర్వం సాగిస్తున్నాయి. అయితే మారిన పరిణామాలతో  ప్రతీచోట ఎన్నిక ఏ ఒక్కరాజకీయ పార్టీకి అంత ఈజీగా లేకపోవడంతో చెమటోడ్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా ఏకపక్షంగా ఏ పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు కానరావడం లేదు. ఈ తీరు ఆయాపక్షాల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. పోటీలో ఈసారి ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించడమే ప్రధాన కర్తవ్యంగా రెండు ప్రధాన పక్షాలు ముందుకు సాగుతుండటంతో ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది.
 
అసెంబ్లీ నియోజకవర్గంలో... 
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలిదఫాలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. నియోజకవర్గంలోని 7  జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాండూర్, కన్నెపల్లి జెడ్పీటీసీ సా ్థనాల్లో ఆరుగురు అభ్యర్థులు, కాసిపేటలో నలుగురు అభ్యర్థులు, నెన్నెల , భీమిని, బెల్లంపల్లి మండలాల్లో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీకి సిద్ధమయ్యారు. వేమనపల్లి మండలంలో మా త్రం ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది.   

ఏకగ్రీవానికి ‘నై’ 
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వగా పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం ఆ పాచిక ఎక్కడా సరిగా పారలేదు. ప్రతీచోట పోటీ చేయడానికే  ఔత్సాహిక అభ్యర్థులు మరీ ముఖ్యంగా యువకులు ఆసక్తి చూపించారు. రిజర్వేషన్‌ ప్రాతిపదికన మహిళలు కూడా అధికసంఖ్యలోనే పోటీలో ఉన్నారు. ఓ ప్రధానరాజకీయ పార్టీ అక్కడక్కడ తమ అభ్యర్థులు ఏకగ్రీవం కావడానికి ఆదిలో పావులు కదిపినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్నిచోట్ల కూడా పోటీకీ అభ్యర్థులు సిద్ధపడటం, ప్రలోభాలకు ఆకర్షితులు కాకపోవడంతో పోటీ అనివార్యమైంది.  కాగా ఎన్నికల ప్రచారపర్వం మరో రెండు, మూడురోజుల్లో  ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.  

ఎంపీటీసీ బరిలో 166 మంది 
47 ఎంపీటీసీ స్థానాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాసిపేట మండలంలో ఉన్న  9 స్థానాల్లో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా తాండూర్‌లోని  9 స్థానాలకు 39 మంది, బెల్లంపల్లిలోని 8 స్థానాలకు 26 మంది, నెన్నెలలో 7స్థానాలకు 19 మంది. కన్నెపల్లిలో 5 స్థానాలకు 18 మంది, వేమనపల్లిలో 5 స్థానాలకు 14 మంది పోటీలో ఉన్నారు. భీమిని మండలంలో 4 స్థానాలు ఉండగా 8 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చిన్నగుడిపేట ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఇక్కడ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా ఆఖరిరోజు నలుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌  అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అయితే సదరు అభ్యర్థి ఎన్నికను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ ఒక్కస్థానంలో మినహా ఇతర అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement