సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల్లో ఎన్నికల అధికారుల కళ్లు గప్పేందుకు వివిధ పార్టీలు.. నేతలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా సంఘాల సభ్యుల బ్యాంకు పాస్‌బుక్‌ల జిరాక్స్ ప్రతులు సేకరించి వారి ఖాతాలకు కొందరు సొమ్ము పంపిణీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ద్వారా సొమ్ము పంపిణీ చేసినా తెలుసుకునేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం జరిగిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) జయరాజ్ కెనెడీ, ఎన్నికల వ్యయం నోడల్ ఆఫీసర్, జీహెచ్‌ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ వెంకటేశ్వర్‌రెడ్డి, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ వివరాలను అధికారులు వెల్లడించారు.
నివేదికలు అందించాలి..
రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకైనా సరే ఏకకాలంలో ఎక్కువ మందికి ఒకే ఖాతానుంచి పంపిణీ జరిగినా, ఒకే రోజు దాదాపు రూ.10 లక్షల నగదు విత్‌డ్రా చేసుకున్నా సదరు వివరాలను తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారి, ఆదాయపు పన్ను అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. నేరుగా డబ్బు పంపిణీ చేస్తే పట్టుబడతామనే యోచనతో కొందరు ఇలా చేసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లోని అన్ని జాతీయ, షెడ్యూల్డ్, ప్రైవేట్ బ్యాంకులు తమ బ్యాంకు నుంచి జరిగిన నగదు పంపిణీ, విత్‌డ్రాలకు సంబంధించి ఏమాత్రం అనుమానం ఉన్నా సదరు వివరాలను ఏరోజుకారోజు తెలియజేయాల్సి అవసరముంది. ఆయా అంశాలకు సంబంధించి ప్రతిరోజూ నివేదిక పంపించాలని, అనుమానాస్పద లావాదేవీలు లేని పక్షంలో ఆ వివరాలనూ తెలియజేయాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతిరోజూ ఈ నివేదిక పంపించడడం తప్పనిసరి. లేని పక్షంలో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణిస్తుంది. అలాంటి బ్యాంకులపై విచారణ జరపడంతో పాటు విచారణలో బ్యాంకర్లు ఏ అభ్యర్థితోనైనా లేదా రాజకీయ పార్టీతోనైనా కుమ్మక్కైనట్లు గుర్తిస్తే ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుంది. అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేయకుండా నివారించేందుకూ ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఎన్నికల వ్యయం నమోదు చేసేందుకుగాను బ్యాంకులు అభ్యర్థులతో ఎన్నికల ఖర్చు కోసమే ప్రత్యేకంగా కొత్త ఖాతా తెరిపించి, చెక్‌బుక్ ఇవ్వాల్సిన అవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment