
కరకగూడెం: ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా, అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమిస్తుంది. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కుని వినియోగించుకునే వాతావరణం కల్పించడం, చూడడం అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, అభ్యర్థుల నామినేషన్ పత్రాల దాఖలు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువరించేవరకు బూత్ లెవల్ అధికారుల నుంచి జిల్లా ఎన్నికల అధికారుల వరకు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించారు. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తారో తెలుసుకుందాం!
జిల్లా ఎన్నికల అధికారి
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతీ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడం, నామినేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబిత ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేయడం తదితర కార్యక్రమాల్లో ఎన్నికల ప్రధాన అధికారి పాత్ర ఎంతో ఉంటుంది.
రిటర్నింగ్ అధికారి
ఎన్నికల నిర్వహణకు కేంద్రం రిటర్నింగ్ అధికారులను నియమిస్తుంది. సంబంధిత నియోజకవర్గాలను పర్యవేక్షించడం, ఆ పరిధిలోని మండలాల్లో విస్తృతంగా పర్యటించడం, నామినేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబిత ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, వారికి శిక్షణనివ్వడం తదితర కార్యక్రమాలు చేస్తారు. ఆర్డీఓలకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు.
సెక్టోరియల్ అధికారి
ఆయా నియోజకవర్గాల్లోని 8 నుంచి 10 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు సెక్టోరియల్ అధికారిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. వీరి బాధ్యతలు ఆయా బూత్‌లలో ప్రశాంతమైన వాతవరణం ఉండేలా చర్యలు తీసుకోవడం. అక్కడి పరిస్థితులను బట్టి ఆయా చోట్ల 144 సెక్షన్ విధించే అధికారం కలిగి ఉంటారు.
ఓటరు నమోదు అధికారి
ఓటరు నమోదు అధికారిగా ప్రతీ నియోజవర్గ స్థాయిలో ఉంటారు. ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా తయారి వీరి ప్రధాన విధులు. జాబితాలో పేర్లు , చిరునామా, ఫొటోలు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించాల్సింటుంది.
ప్రిసైడింగ్ అధికారి
ప్రతీ పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఎన్నికలకవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూంకు చేర్చడం వరకు వీరి బాధ్యత కీలకం. వీరికి సహాయ ప్రిసైడింగ్ అధికారులు అవసరమైన సహాయం అ«ందిస్తారు. పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి.
సూక్ష్మ పరిశీలకులు
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల పర్యవేక్షణపై నివేదిక రూపొందించి పంపించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తారు. ప్రతి మండలానికి ఒకరు మాత్రమే ఉంటారు. వీరంతా ఎన్నికల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
పోలింగ్ ఏజెంట్లు
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటిపడే అభ్యర్థులు పోలింగ్ జరిగే ప్రతీ కేంద్రాన్ని నేరుగా పరిశీలించలేరు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ ఏజెంటును నియమించుకోవచ్చు. పోలింగ్ ఏజెంటు ఆ కేంద్రంలో ఓటరై ఉండాలి.
బూత్ లెవల్ అధికారులు
కొత్తగా ఓటర్ల జాబితాలో చేరేవారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పు ల సవరణకు అవసరమైన ఫారాలివ్వడం, అర్హులైన ఓటర్లంత ఓటర్లుగా నమోదయ్యేలా చూడడం, ఓటర్ల జాబితా ప్రదర్శన పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకారం అందించడం వీరి బాధ్యత. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం వంటివి చేస్తుంటారు. వీఆర్‌ఏలు, కారోబార్లు, అంగన్‌వాడీ టీచర్లను బూత్ లెవల్ అధికారులుగా నియమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment