మందు బందు.. పల్లెలు ప్రశాంతం | Elections Effect on Village Belt Shops, Karimnagar | Sakshi
Sakshi News home page

మందు బందు.. పల్లెలు ప్రశాంతం

Published Thu, Nov 8 2018 9:08 AM | Last Updated on Thu, Nov 8 2018 9:08 AM

Elections Effect on Village Belt Shops, Karimnagar - Sakshi

సాక్షి,పెగడపల్లి(ధర్మపురి): ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. పోలీసులు, ఆబ్కారీశాఖ అధికారులు గ్రామాల్లో జోరుగా తనిఖీలు చేస్తున్నారు. బెల్టు షాపులు, గుడుంబా తయారీ, విక్రయాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తుగా బెల్టు షాపులు నిర్వాహకులను గుర్తించి బైండోవర్‌ చేస్తున్నారు. తరువాత అదే పద్ధతిన విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని పల్లెలో మందు బాబుల జోరు తగ్గింది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. ఈ పరిమాణాలపై  గ్రామంలో మల్లక్క, ఎల్లక్క అనే ఇద్దరు మహిళలు ఇలా సంభాషించుకుంటున్నారు. 

ఎల్లక్క: ఏం మల్లక్క.. బాగున్నావా..?  
మల్లక్క: ఆ కొద్ది రోజుల నుంచి ప్రశాంతంగా ఉంటున్నా. 
ఎల్లక్క: ఎందుకు..? ఇన్ని రోజుల నుంచి ప్రశాంతంగా లేవా ఏందీ? 
మల్లక్క: ఆ ఏం ప్రశాంతత పొద్దంతా కూలికెళ్లిన పెనిమిటి రోజూ సాయంత్రం తప్పతాగచ్చి ఒక్కటే నొళ్లి చేసేటోడు. గీ ఎన్నికల పూణ్యమాని ఊల్లేమందు(మద్యం) దుకాణాలను మొన్నటి నుంచి పోలీసోల్లు బందు చేయించుండ్రు. దీంతో నా పెనిమిటి తాగుడు తగ్గించుండు. లొల్లి కూడా తక్కువయింది. 
ఎల్లక్క: అవును మా ఊళ్లే కూడా గీ మందు దుకాణాలు తీత్తలేరు. ఎందుకో అనుకుంటున్నా..?  
మల్లక్క: ఇది ఎలచ్చన్ల సమయం. గిప్పుడు పాలనంత గా ఎన్నికల సంఘమోల్ల చేతిలో ఉందట. గీ నాయకులు చెప్పినవి ఇనరట. గా ఎన్నికల సంఘం అధికారులు చెప్పడంతో పోలీసోల్లు ఆబ్కారీ సార్లూ ఊర్లోని దుకాణాలను చెకింగ్‌ చేస్తున్నారు. కల్లు అమ్మవద్దని చెబుతున్నారు. అమ్మితే జైలులో పెడుతరట. 
ఎల్లక్క: గదా సంగతి మా ఊళ్లో ఇంతకు ముందు ఇంటికో దుకాణంలో కల్లు అమ్మేటోళ్లు. బాగా మంది గీ దుకాణాళ్లకు వచ్చి తాగేటోళ్లు. ఊర్లో లొల్లులు జడగాలు చేసేటోళ్లు. గిప్పుడు దుకాణాల్లో కల్లు అమ్ముతాలేరు. ఎవరూ అస్తలేరు. కోట్లాటలు లేక ఊరు చడిసప్పుడు లేకుండా సల్లగుంది. ఎపుడూ గిట్లుంటే మంచిగుండు. 
మల్లక్క: గీ ఎలచ్చన్ల వరకే గిట్లుంటదట. కొత్త సర్కారు వచ్చినంక మల్ల అందరు మొదట్లెక్కనే అమ్ముకుంటరట. 
ఎల్లక్క: అయితే ఎప్పటికి ఎన్నికల సంఘం పాలిస్తే మంచిగుండు. అప్పుడే మంచిగుంది. 
మల్లక్క: గట్టేట్ల కుదర్తది. మనది ప్రజాస్వామ్య దేశం. మన పాలకులను మనమే ఎన్నుకోవాలి. 
ఎల్లక్క: మరి గెలిచినంక గీ పాలకులు కూడి గిట్ల చెయ్యచ్చు కదా. 
మల్లక్క: గిట్ల చేస్తే సర్కారుకు ఆదాయం ఎట్లస్తది. మనోళ్లు తాగడంతో వచ్చే పైసలతో అభివృద్ధి పేరిట జేబులు నింపుకోవాలి. 
ఎల్లక్క: అలాంటోళ్లకు మనమెందుకు ఓటేయ్యాలి. 
మల్లక్క: గందుకే కల్లు పోస్తమనే, పైసలిస్త మనేటోళ్లను తరిమికొట్టాలి. మంచోళ్లను ఎన్నుకోవాలి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement