సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు ‘ఖరీదు’గా మారాయి. నాలుగున్నరేళ్ల కిందట జరిగిన సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. కుల సంఘాలు, భారీ బహిరంగసభలు, ఊరూరా ప్రచారం, సోషల్ మీడియా నిర్వహణ, ప్రచారం కోసం ప్రత్యేక బృందాలు...పోల్ మేనేజ్‌మెంట్ అన్నీ కలసి ఖరీదైన వ్యవహారంగా మారింది. అన్ని నియోజకవర్గాల్లోనూ ‘ఓటు విలువ’పెరిగింది. ఓటుకు నోట్లతోపాటు మద్యం పంచే పరిస్థితితో ఖర్చు లెక్కలు అందడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్ స్థానాల్లోనే కాదు కొన్ని రిజర్వుడ్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో పోటాపోటీ స్థానాలు 50 ఉన్నాయి. ఇలాంటి ఒక్కో స్థానంలో బరిలో ఉన్న అభ్యర్థులు అందరూ కలసి రూ.40 కోట్లు వంతున ఖర్చు చేస్తున్నారు. ఈ స్థానాల్లోనే రూ. రెండు వేల కోట్లు అవుతుందని అంచనా. మరో 50 సెగ్మెంట్లలోనూ సగటున రూ.25 కోట్ల వంతున వ్యయం చేసే పరిస్థితి ఉంది. ఈ స్థానాల్లో కలిపి రూ.1,250 కోట్లు ఖర్చు కావస్తోంది. మిగిలిన 19 సెగ్మెంట్లలోనూ సగటున పది కోట్ల వంతున ఖర్చయినా రూ.200 కోట్లు కానుంది. ప్రస్తుత అంచనాలతో ఖర్చు లెక్కలు వేసినా ఎన్నికల ఖర్చు రూ.3,500 కోట్లు అవుతోంది.
పోలింగుకు ముందు రోజే కీలకం...
ఎన్నికలలో పోల్ మేనేజ్‌మెంట్ కీలకంగా మారుతోంది. ప్రచారం, మేనిఫెస్టోలో ఎన్ని మార్పులు వచ్చినా పోలింగ్‌కు ముందురోజు వ్యవహారాలే కీలకం.ఓటింగ్‌కు ముందు రోజు నగదు, మద్యం పంపిణీ ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతూనే ఉంది. బూత్‌ల వారీగా ఓటర్ల సంఖ్య ప్రకారం పోటీదారులు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్‌లోని స్థానాలతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ వంటి కీలక స్థానాల్లో ఎన్నికల వ్యయం పెరుగుతోంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలోనే ఖర్చు చేసే సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటోంది.రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ ఇప్పుడు భారీగా వ్యయపరుస్తున్నారు. గతంలో నామమాత్రపు ఖర్చుతో ఇక్కడ ఎన్నికలు పూర్తయ్యేవి. ఇప్పుడు జనరల్ స్థానాలతో సమానంగా ఆ సెగ్మెంట్లలో అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు.
3 నెలల ముందే ప్రచారం ప్రారంభం అవ్వడంతో...
ముందస్తు ఎన్నికలతో గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రచార ఖర్చు పెరిగింది. అసెంబ్లీని రద్దు చేసిన రోజే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అదే రోజు నుంచి వీరు ప్రచారం మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పోటీగా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ వారు ప్రచారం జరిపారు. గతంలో గరిష్టంగా నెల రోజులు ప్రచారం ఈసారి 3 నెలలకుపైగా జరుగుతోంది. దీంతో ప్రచార ఖర్చు మూడు రెట్లు పెరిగింది. ఒక్కో అభ్యర్థి ప్రచారంలో వాహనాలకే రూ.పది లక్షల మేర ఖర్చు చేసిన పరిస్థితులు ఉన్నాయి.
పట్టుబడేది తక్కువే..
ఎన్నికలలో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంటే...అధికారులు స్వాధీనం చేసుకునేది మాత్రం వందల్లోనూ ఉండటంలేదు. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో రూ.154 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఇప్పటి వరకు రూ.104 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలలో ఖర్చయ్యే మొత్తంలో ఇది చాల తక్కువ. మరోవైపు మద్యం పంపిణీ కూడా అంతులేకుండా పెరుగుతోంది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో 30 శాతం దీనికే కేటాయించాల్సి వస్తోంది. నగరం, పట్టణం, గ్రామాలు తేడా లేకుండా అంతటా మద్యం పంపిణీ జరుగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నగదుతోపాటు, అవసరమైన మద్యాన్ని నిల్వ చేసి పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment