
జైపూర్‌లో ఎలివేటెడ్ మెట్రో ట్రాక్ నిర్మాణం (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని కొన్ని మార్గాల్లో ఒక వరుసలో రోడ్డు, మరో వరుసలో మెట్రో రైలు మార్గాలు రానున్నాయా..? అంటే అన్నీ అనుకూలిస్తే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జైపూర్‌లోని ‘ఎలివేటెడ్ రోడ్, మెట్రో ట్రాక్’ తరహాలో ఒకే పిల్లర్లపై రెండు వరుసల్లో ఒక వరుసలో సాధారణ వాహనాల కారిడార్, మరో వరుసలో మెట్రో రైల్ ట్రాక్ నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. మెట్రో రెండో దశలో భాగంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో ట్రాక్ రానుంది. ఇదే మార్గంలో ఎస్సార్‌డీపీలో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన వివిధ పనులున్నాయి. ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు దాదాపు 22 కి.మీ.ల మేర మేజర్ కారిడార్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు తదితర పనులకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. వీటిల్లో టోలిచౌకి ఓయూ కాలనీ, బొటానికల్ గార్డెన్, నానల్‌నగర్, ఖాజాగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, బయో డైవర్సిటీపార్క్, జీవీకే మాల్, మెహదీపట్నం తదితరమైనవి ఉన్నాయి.
వీటిల్లో కొన్ని చోట్ల ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయం కలిగిన ఈ మేజర్ కారిడార్ పనుల్లో ఇప్పటికే దాదాపు రూ.800 కోట్ల మేర మంజూరై పనులు జరుగుతున్నాయి. ఈ మేజర్ కారిడార్ మార్గంలోనే మెట్రో రెండో దశ కూడా రానుండటంతో భూసేకరణ ఇబ్బందులు, ఖర్చు తదితరమైనవి పరిగణనలోకి తీసుకుని ఎస్సార్‌డీపీ పనుల ఫ్లై ఓవర్లు, మెట్రోట్రాక్‌లు వేర్వేరుగా కాకుండా రెండింటినీ రెండంతస్తుల్లో నిర్మిస్తే ఎలా ఉంటుందని సంబంధిత అధికారులు యోచించారు. జైపూర్‌లోని ఇలాంటి ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకొని నగరంలో సాధ్యాసాధ్యాలపై యోచిస్తున్నారు. వీలైన ప్రాంతాల్లో దిగువ వరుసలో ఎలివేటెడ్ కారిడార్, పై వరుసలో మెట్రో ట్రాక్ నిర్మించవచ్చునని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జీవీకే మాల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.10, 12, మాసాబ్‌ట్యాంక్, ఎన్‌ఎండీసీ, మెహదీపట్నం మార్గంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కారిడార్‌లో రోజుకు సగటున రెండు లక్షల వాహనాలు ప్రయాణిస్తుండటటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు అధికారుల సంయుక్త సమావేశంలో దీనికి సంబంధించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment