ఆరోగ్యశ్రీలో రాజుకున్న వేడి
* పోటాపోటీగా అధికారులను నియమించిన ఇరురాష్ట్రాలు
* ఎవరి కింద పనిచేయాలో తెలియక ఉద్యోగుల్లో గందరగోళం
* ఏపీ అధికారి నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కినుక
* అందుకే తమ అధికారిని నియమించినట్టు సమాచారం
సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో అగ్గిరాజుకుంది. ఆ సంస్థకు ఇన్‌చార్జిలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర్వులివ్వడంతో ఒక్కసారిగా ఆరోగ్యశ్రీలో గందరగోళం ఏర్పడింది. అక్కడున్న ఉద్యోగులు ఎవరికింద పనిచేయాలి, చాంబర్‌ల సంగతేమిటి, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం (ఆన్‌లైన్ చెల్లింపుల నుంచి, వైద్య సేవల అనుమతుల వరకూ) ఎవరి అధీనంలో ఉండాలి అన్నదానిపై సందేహాలు మొదలయ్యాయి. రెండు మాసాల కిందటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ విభజన కోసం ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్ అధికారులను నియమించడం వివాదానికి దారితీసింది.
ఏకపక్ష నిర్ణయంతో..: నాలుగు రోజుల క్రితం వరకూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ధనుంజయరెడ్డి సీఈవోగా ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ మధ్యనే ఆయన్ను బదిలీ చేసింది. ఆ స్థానంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ లవ్‌అగర్వాల్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. అయితే ట్రస్ట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం తమకు చెప్పకుండా ఆయన్ను నియమించడంపై తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. తమను సంప్రదించకుండా నియామకం చేపట్టడం సరైన పద్ధతి కాదని తెలంగాణ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను ఆరోగ్యశ్రీకి అదనపు బాధ్యతలు నిర్వహించాలని మంగళవారం ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న చాంబర్‌లో ఎవరు కూర్చోవాలన్నది చర్చనీయాంశమైంది.
నివేదికలు పరిశీలించేది ఎవరు?
ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో రోగుల వైద్య పరీక్షల నివేదికలు పరిశీలించడం, చికిత్సలకు అనుమతు లు, ఆస్పత్రులకు నగదు చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంటాయి. ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించే నగదు ఏ రాష్ట్ర రోగులకు ఆ రాష్ట్ర మే చెల్లిస్తోంది. కానీ చాలామంది ఇక్కడ పని చేసే సిబ్బంది కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ వారే. ఎక్కువ మంది ఉన్నతస్థాయి పోస్టుల్లో ఉన్నవారు ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన వారు. వీరిలో ఎవరు ఏ రాష్ట్రానికి పనిచేయాలో తెలియదు. అయితే ఇప్పటి వరకూ రోగుల నివేదికలు పరిశీలించేందుకు ఒక కమిటీ ఉంది. వీళ్లందరూ తెలంగాణకు చెందిన వైద్యులే. అయితే ఇకపై ఏపీ రోగుల నివేదికలు ఎవరు పరిశీలిస్తారనే సమస్య ఉత్పన్నమవుతోంది.