మంతటి సమీపంలో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలు
సాక్షి, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా మారాక ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. ఇంటి నిర్మాణాలకు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఎక్కువ కాలం మన్నిక ఉండేందుకు ఇటుకలకే మొగ్గు చూపుతారు. దీంతో ఇటుకలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. మండల వ్యాప్తంగా ఎంతోమంది యువకులు ఇటుక బట్టీలలో నిమగ్నమై వారి కుటుంబాలను పోషించుకోవడంతో పాటు కూలీలకు పని కల్పిస్తూ ఉపాధిని చూపుతున్నారు.
మండలంలోని నాగర్‌కర్నూల్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తూడుకుర్తి, బొందలపల్లి, శ్రీపూర్, దేశియిటిక్యాల, వనపట్ల తదితర గ్రామాలలో ఇటుక బట్టీలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తి కావడంతో కూలీలు ఇటుక బట్టీల వైపు అడుగులు వేస్తూ ఉపాధిని పొందుతున్నారు. ఒక ట్రాక్టర్ ఇటుకను దాదాపు రూ.10 వేల నుంచి 15వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అందులో రకరకాల ఇటుకలను తయారు చేస్తూ వాటిని సకాలంలో భవన నిర్మాణ రంగానికి అందిస్తూ యువత ఉపాధి పొందుతున్నారు.
భూములు లీజుకు తీసుకుని..
మండలంలోని శ్రీపురం, నెల్లికొండ, దేశియిటిక్యాల, తిరుమలాపూర్ తదితర ప్రాంతాలలో ఇటుక బట్టీ నిర్వాహకులు భూములను లీజుకు తీసుకుని అందుకు కావాల్సిన మట్టితో పాటు ఇటుకలను కాల్చేందుకు బొగ్గు, వంట చెరుకును సమీకరిస్తూ ఇటుక బట్టీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కూలీలకు వెయ్యి ఇటుకలు కోసేందుకు దాదాపుగా 750 నుంచి 1500 దాకా చెల్లిస్తున్నారు. ఇద్దరు కూలీలు కలిసి రోజుకు 3వేల దాకా ఇటుకలను తయారు చేస్తూ 2వేలకు పైగా సంపాదిస్తున్నట్లు పేర్కొంటున్నారు. భూములకు లీజు చెల్లిస్తూ కూలీల ఖర్చులు భరిస్తూ కొంత సంపాదించుకుంటున్నారు.
ఖర్చు పెరిగిపోయింది
ఇటుక తయారు చేసేందుకు ఒకప్పుడు మట్టి తక్కువ రేటుకు లభించేది. ప్రస్తుతం లైట్ వెయిట్ పెల్లను తయారు చేసేందుకు మట్టితో పాటు అందులో వరి పొట్టు, బూడిదను సేకరించాల్సి వస్తుంది. ఇందుకు గానూ ఖర్చు అధికంగా పెరిగి అనుకున్న లాభాలు రావడం లేదు. ఏదిఏమైనా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇటుక బట్టీల తయారీతో కుటుంబాలను పోషించుకుంటున్నాం.
– ఎ. రాంచందర్, ఇటుక బట్టీ నిర్వాహకుడు, మంతటి
Comments
Please login to add a commentAdd a comment