మోర్తాడ్ : డిచ్‌పల్లి మండలంలోని చంద్రయాన్‌పల్లికి చెందిన గడ్డం యమున(52), బర్దీపూర్ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన కూన రాజవ్వ (53) ఉపాధి హామీ కూలీలు. తీవ్ర ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురై ఇటీవల ప్రాణాలు కోల్పోయూరు. వీరిద్దరే కాదు జిల్లాలో ఇలాంటి వారు ఎందరో ఉపాధి కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. అరుునా, ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు. ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ చట్టం స్పష్టం చేస్తోంది. కానీ, ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉపాధి కూలీలకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు. ఎండ వేడిమికి తట్టుకోవడానికి కూలీలకు టెంట్లు సరఫరా చేయాలి.
ప్రభుత్వం టెంట్ల కొనుగోలు అంశంపై నిర్లక్ష్యం వహించడంతో కూలీలు ఎండలో పనిచేస్తున్నారు. ఏటా టెంట్ల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించి ఉపాధి పనులు జరిగే గ్రామాలకు సరఫరా చేయాలి. గతంలో జిల్లాకు సరఫరా అయిన టెంట్లను కేవలం 26 మండలాలకు పంపిణీ చేసి మిగతా 10 మండలాలకు మొండి చేయి చూపించారు. 26 మండలాల్లోని 510 గ్రామ పంచాయతీల పరిధిలోని 11,995 ఉపాధి కూలీల గ్రూపులకు వీటిని సరఫరా చేశారు. మోర్తాడ్, కమ్మర్‌పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, సదాశివనగర్, గాంధారి, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లోని ఉపాధి కూలీలకు వాటిని సరఫరా చేయలేదు.
సుమారు మూడేళ్ల నుంచి వీరికి టెంట్లు సరఫరా చేయడం లేదని కొందరు ఉపాధి అధికారులు తెలిపారు. 26 మండలాలకు సరఫరా చేసి పది మండలాలకు మాత్రమే ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఉపాధి పనులకు విధించిన లక్ష్యం, వారికి సౌకర్యాలు కల్పించడంలో లేదా.? అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఆ పది ఎందుకు వదిలారో..!
Published Thu, May 7 2015 3:55 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement