ఏప్రిల్ 1 నుంచి రూ.180 కూలీ
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజూ వారీ వేతనాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీచేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద గ్రామీణ పేద కూలీలకు రోజువారీ వేతనం రూ.169 ఇస్తుండగా, తాజా పెంపుతో అది రూ.180 కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
వేతన పెంపునకు సంబంధించిన ఫైలును గ్రామీణాభివృద్ధి విభాగం ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేడో, రేపో ఉత్తర్వులు జారీ కానున్నాయని సమాచారం. పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచే అమలవుతుం దని గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు తెలిపారు.
రోజుకు 8 లక్షల మందికి ఉపాధి
వేసవి కాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని (హైదరాబాద్ మినహా) జిల్లాల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. గ్రామీణాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో వ్యవసాయ పనులు ఇప్పటికే పూర్తికావడం, మరికొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండటంతో గత మూడు నెలలుగా రోజువారీ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
గత జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1.33 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనగా.. ఫిబ్రవరిలో 5.68 లక్షలు, మార్చిలో వీరి సంఖ్య 7.90 లక్షలకు చేరుకుంది. తాజా సమాచారం మేరకు ప్రతిరోజూ 8,00,693 మంది ఉపాధి హామీ పనులకు వస్తున్నారని, ఈ నెలాఖారు కల్లా ఈ సంఖ్య రోజుకు 12 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
‘ఉపాధి’పై నేడోరేపో రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు
Published Wed, Apr 15 2015 1:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement