పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కనుమరుగవుతున్న ప్రాణుల జాబితాలోకి ప్రస్తుతం అరుదైన మత్స్య సంపద కూడా చేరుతోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల కాల్వల్లో ఎక్కువగా దొరికే అనేక రకాల జలపుష్పాలు అంతరించిపోతున్నాయి. గతంలో గ్రామాల్లోని కాల్వలు, చెరువు, కుంటల్లో బొచ్చెలు, కొర్రమీనులు (మట్టలు), బొమ్మిడాలు, ముల్లు జెల్లలు, రొయ్యల వంటి మత్స్య సంపద ఎక్కువగా కనిపించేది. వర్షాకాలంలో చెరువులు కుంటల నుంచి కాల్వలకు నీరు వదలగానే ఇవి విరివిగా దొరికేవి. కాల్వల్లో పెరిగే ఈ చేపలు ఎంతో రుచిగా ఉండడంతో మాంసాహార ప్రియులు వీటి కోసం ఎంతో ఆరాట పడుతుంటారు.
ముఖ్యంగా వ్యవసాయ పనులు లేని సమయాల్లో వలలు, గాలాలు పట్టుకుని చేపలు పట్టి జీవనోపాధి పొందేవారు. అయితే పదిహేనేళ్లుగా నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులు, రసాయన ఎరువులవాడకం, నీటి కలుషితం వల్ల మత్స్య సంపద కనుమరుగవుతోంది. గతంలో వర్షాకాలం వచ్చిందంటే రైతులు, మత్స్యకారులు కాలువల్లో చేపలను పట్టి ఇంటి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన వాటిని సదాశివపేట మార్కెట్లో విక్రయించేవారు. వర్షాకాలంలో వాగులు వంకల నుంచి చేపలు వరద నీటిలో ఎదురీదుతూ గ్రామాల పంట పొలాలు, చెరువులు, కుంటల్లోకి వచ్చి చేరేవి. దీంతో వీటిలో చేపల సంతానం పెరిగేది. కానీ మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
కొర్రమీనులు, బొమ్మిడాలు, బొచ్చెలు, జెల్లలు తదితర చేప జాతులు కనిపించకుండా పోతున్నాయి. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇవి అంతరించి పోయే ప్రమాదం ఉందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ మొక్కలను విరివిగా పెంచాలని విద్యాధికులు సూచిస్తున్నారు.
జలపుష్పాల జాడేది?
Published Sat, Sep 13 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement