యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన వరికుప్పల గణేష్ ఈనెల 6 నుంచి కనిపించకుండా పోయాడు.
- ప్రియురాలితో కలసి భద్రాచలం పయనం
- మార్గమధ్యలో చనిపోవాలని నిర్ణయం.. తప్పించుకొని వచ్చిన ప్రియురాలు
- గణేష్ ఆచూకీ కోసం గాలింపు
వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన వరికుప్పల గణేష్ ఈనెల 6 నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన అతడి తండ్రి.. ఆదివారం ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘట్‌కేసర్ సమీప కళాశాలలో గణేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న సహవిద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలసి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో గణేష్ తన మొబైల్‌ను విక్రయించాడు.ఆ డబ్బులతో మణుగూరు రైలు ఎక్కి మధ్యలో దిగారు. అక్కడ లాడ్జి తీసుకున్నారు.
ఈ సమయంలో ఇద్దరం చనిపోదామని గణేష్ చేసిన ప్రతిపాదనను ప్రేమికురాలు వ్యతిరేకించింది. అయినప్పటికీ గణేష్ వినకుండా క్రిమిసంహారక మందు కొనడానికి ఆమె చేతి ఉంగరాన్ని తీసుకుని అమ్మడానికి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో ఆమె లాడ్జి నుంచి బయటకు వచ్చి ఎలాగోలా హైదరాబాద్‌కు చేరుకుంది. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పింది. ఈ విషయాన్ని కళాశాలకు చెందిన అధ్యాపకుడు గణేష్ తండ్రికి సమాచారం అందించాడు. ఆయన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సోమవారం తెల్లవారు జామున గణేష్ తండ్రి కుమారుని వెతికేందుకు భద్రాచలం వెళ్లారు.