
పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు
- తెలంగాణ విద్యావిధానంపై సమీక్షలో సీఎం కేసీఆర్
- పేదలు, ధనవంతులు అన్న తేడా ఉండొద్దు
- మరిన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలి
- హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండటానికి వీల్లేదు
సాక్షి, హైదరాబాద్: పేదలు, ధనవంతులు అన్న తేడా లేకుండా ఒకే పాఠశాలలో, ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా తెలంగాణ రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేల పిల్లలతో పాటే నిరుపేదల పిల్లలూ ఒకే స్కూల్లో చదవాలని, ఒకే యూనిఫాం ఉండాలని సూచిం చారు. ఈ మేరకు కేజీ నుంచి పీజీ వరకు ఉత్తమ విద్య అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు.
తెలంగాణ విద్యా విధానంపై శనివారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు బీఆర్ మీనా, శైలజా రామయ్యర్, ప్రదీప్‌చంద్ర, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్, నర్సింగరావు, శ్రీధర్, స్మితా సబర్వాల్ తదితరులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ప్రీస్కూల్ విద్య అందుతోందని, వాటిని ప్లే స్కూళ్లుగా మార్చాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలన్నారు.
పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల పనితీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. సరైన విద్య అందక పేద విద్యార్థులు భవిష్యత్తులో నిరుపయోగమైన తరంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పేద పిల్లలందరూ ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ విద్య అందుకోవాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు బాగుందని, వాటి సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించారు.
మండలానికి రెండు మూడు చొప్పున రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, అందులోనే 12వ తరగతి వరకు విద్య అందించాలనే ప్రతిపాదనతో పాటు నిర్బంధ విద్య అమలుపై వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమీక్షలో చర్చించారు. అయితే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. విద్యారంగంలో అనుభవజ్ఞులు, మేధావులు, సీనియర్ అధికారులతో త్వరలో సదస్సు నిర్వహించి తెలంగాణ విద్యా విధానంపై చర్చించాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ పరిశీలించిన ప్రతిపాదనలివీ..
ఒకటో ప్రతిపాదన: 4వ తరగతి నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలి.
రెండో ప్రతిపాదన: 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలి.
మూడో ప్రతిపాదన: ప్రస్తుతం మండలానికి 3, 4 స్కూళ్లలో ఆంగ్ల విద్యా బోధన జరుగుతోంది. ఇదే పద్ధతి అన్ని స్కూళ్లలోనూ కొనసాగాలి.
నాలుగో ప్రతిపాదన: మండలానికి 4 రెసిడెన్షియల్ స్కూళ్లుండాలి. కనీసం ఒకటైనా ఉండాలి.
ఐదో ప్రతిపాదన: తెలుగు మీడియం విద్యార్థులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్ నేర్పడంపై దృష్టి పెట్టాలి. టీచర్లూ ఆంగ్ల బోధనకు సన్నద్ధం కావాలి.
వసతి గృహాలకు సన్న బియ్యం
రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు మేలు రకం సన్న బియ్యాన్ని అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎవరూ అడగకపోయినా వసతి గృహాల విద్యార్థుల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు చదువులో ఉండగానే వృత్తి నైపుణ్యం పెంచాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థులను పరిశ్రమలకు అప్పగించాలని, అక్కడ తాము చదివే చదువు ద్వారా చేయాల్సిన పనులపై అవగాహన పెంచుకోగలుగుతారని అభిప్రాయపడ్డారు.