
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీపీ, షుగర్ రోగులకు ఒకేసారి నెలకు సరిపడా మందులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్ అనంతరం రక్తపోటు, మధుమేహ వ్యాధులకు నెలకు సరిపడా మందులిచ్చే కార్యక్రమం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాదు వారి జీవిత కాలమంతా ఈ మందులను ఉచితంగా అందించనున్నారు.
కొనసాగుతోన్న వైద్య పరీక్షలు
ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)పై స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతోంది. అలాగే జూన్ చివరి వారం లేదా జులై మాసంలో మరికొన్ని జిల్లాల్లో ఎన్‌సీడీ స్క్రీనింగ్స్ చేపట్టబోతున్నారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ అసంక్రమిత జబ్బుల పరీక్షలను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ గట్టి పట్టుదలతో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ కూడా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. గ్రామాల్లో ఆశా, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మందులు చాలక అవస్థలు
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 104 వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందు గోలీలు ఇస్తున్నారు. వారానికో పదిరోజులకో సరిపోయేంత మాత్రమే ఇస్తున్నారు. దీంతో 104 ఇచ్చే మందుల మీదే ఆధారపడ్డ పేద రోగులు మళ్లీ మందులు వచ్చేదాకా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాక ప్రస్తుతం స్క్రీనింగ్ జరిగే జిల్లాల్లో బీపీ ఎక్కువగా ఉన్నవారికి , షుగర్ లెవల్స్ అసాధారణంగా ఉన్నవారికి ఈ డోసులు సరిపోవడం లేదని, అందుకే వారికి బయటనుంచి ట్యాబ్లెట్స్ కొనుక్కోమని చెబుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
మందుల పంపిణీ బాధ్యత ‘ఆశ’లదే
బీపీకి రెండు రకాలు, షుగరుకు మూడు రకాల గోలీలు వైద్య ఆరోగ్యశాఖ ఇవ్వబోతోంది. బీపీకి 50 ఎంజీ , 20 ఎంజీ డోసులతో కూడిన ట్యాబ్లెట్లను ఇస్తారు. ప్రతి నెలా మందులు అయిపోయాక వాటిని తిరిగి తెచ్చి ఇచ్చే బాధ్యత స్థానిక ఆశ కార్యకర్తలకు అప్పగించారు. స్థానికంగా ఉండే ఆశ కార్యకర్తల వద్దే ఆ గ్రామంలో ఎంతమంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే డేటా ఉంటుంది. దాని ఆధారంగా ప్రతి నెలా మందులు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment