టీ-టీడీఎల్‌పీ నేతగా ఎర్రబెల్లి?
టీ-టీడీఎల్‌పీ నేతగా ఎర్రబెల్లి?
Published Fri, Jun 6 2014 2:34 AM | Last Updated on Sat, Aug 11 2018 4:22 PM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును నియమించే అవకాశమున్నట్లు సమాచారం. శుక్రవారం జరిగే పార్టీ సమావేశంలో ఈ మేరకు అధినేత చంద్రబాబు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా ఎన్నికైన ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమ సమయంలో టీటీడీపీ ఫోరం కన్వీనర్‌గా కీలకంగా వ్యవహరించారు. ఆయన పనితీరును మెచ్చిన బాబు అసెంబ్లీలో పార్టీ పగ్గాలను ఆయనకే అప్పగించాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తానని ఎన్నికల సమయంలో బాబు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాకపోయినా 15 సీట్లను సాధించినందున తనను పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగానైనా నియమిస్తారని కృష్ణయ్య ఆశించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అసెంబ్లీలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎదుర్కొనాలంటే ఎర్రబెల్లి వంటి వాగ్ధాటి గల నాయకుడు అవసరమని బాబు అభిప్రాయపడుతున్నారు.
పార్టీ విప్‌గా కొడంగల్ ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తారని సమాచారం. కాగా, బీసీ నాయకుడిగా నాలుగుసార్లు గెలిచిన తనకు టీడీఎల్‌పీ పదవి దక్కుతుందని ఆశించిన సనత్‌నగర్ ఎమ్మెల్యే, పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
గ్రేటర్‌లో పార్టీ అత్యధికంగా 9 సీట్లు గెలుచుకోవడంలో తమ పాత్రను బాబు గుర్తించలేదని ఆయన వర్గీయులు విమర్శిస్తున్నారు. తలసానితో పాటు ఆర్.కృష్ణయ్య (ఎల్.బి.నగర్), ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి)లను టీడీఎల్‌పీ ఉప నాయకులుగా నియమించే అవాకశముంది.
Advertisement