
సాక్షి, మహబూబాబాద్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. తొర్రూరులో తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధర్వ్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. చదువు పూర్తి చేసుకుని.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలి. నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించనున్నది’ అని దయాకర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషాదయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా మెగా జాబ్ మేళాలో జియో, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, హెటిరో ఫార్మా, కార్వీ లాంటి 80పైగా కంపెనీలు, 40కి పైగా ఉచిత శిక్షణ కల్పించే ట్రైనింగ్ కంపెనీలు పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment